బిగ్ బాస్ షో వెన‌క ఎన్టీఆర్ టార్గెట్ అదే

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ స్టార్ మా ఛానెల్లో బిగ్ బాస్ షో చేస్తున్నాడు. టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోల‌లో ఒక‌రైన ఎన్టీఆర్ ఇంత త‌క్కువ వ‌య‌స్సులోనే బుల్లితెర మీద‌కు ఎందుకు వ‌స్తున్నాడ‌బ్బా ? అన్న డౌట్లు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ షో చేసేందుకు ఎన్టీఆర్ ఒప్పుకున్నాక‌, తాజాగా లుక్ రిలీజ్ చేశాక అంచ‌నాలు రోజు రోజుకు మ‌రింత రెట్టింపు అవుతున్నాయి.

పైగా ఇటీవ‌ల తెలుగు బుల్లితెర మీద ప్ర‌సారం అయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ప్లాప్ ముద్ర వేయించుకుంది. నాగార్జున హోస్ట్‌గా ఉన్న‌ప్పుడు ఓకే అనిపించినా, చిరు వ‌చ్చాక డిజాస్ట‌ర్ టాక్‌తో పూర్ రేటింగ్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ షోను ఎలా ర‌క్తిక‌ట్టిస్తాడా ? అని అంద‌రూ ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ వీరాభిమానులు మాత్రం ఎన్టీఆర్ అంత త్వ‌ర‌గా టీవీ షోల వైపు రావాల్సిన అవ‌స‌రం ఏముందని చ‌ర్చించుకుంటున్నారు. బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌, అమితాబ‌చ్చ‌న్, అమీర్‌ఖాన్ లాంటి వాళ్లు చాలా లేట్ వ‌య‌స్సులోనే టీవీ షోల్లోకి వ‌చ్చారు. మ‌రి ఎన్టీఆర్ ఇంత త్వ‌ర‌గా ఎందుకు ఈ షోల వైపు ఎంట్రీ ఇస్తున్నాడ‌న్న చ‌ర్చ‌లు కామ‌న్‌.

అయితే దీని వెన‌క ఆస‌క్తిక‌ర‌మైన లాజిక్ క‌న‌ప‌డుతోంది. ఎన్టీఆర్ మాస్‌లో ఇప్ప‌టికే దుమ్ము రేపుతున్నాడు. వ‌రుస మాస్ సినిమాల త‌ర్వాత ఇటీవ‌ల కాస్త క్లాస్ ట‌చ్ ఉన్న సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఈ షోతో క్లాస్‌లో మ‌రింత చొచ్చుకు పోయేలా ప్లాన్ చేసుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు క్లాస్ ఇమేజ్ ఉన్నా మాస్‌లో ఉన్నదానితో పోల్చుకుంటే కాస్త త‌క్కువే. ఇప్పుడు ఈ షో ద్వారా క్లాస్‌కు ఎన్టీఆర్ మ‌రింత ద‌గ్గ‌రైతే మ‌నోడి మార్కెట్‌ను, క్రేజ్‌ను ఎవ్వ‌రూ అడ్డుకోలేరు.