బీజేపీకి కాకినాడ రిజ‌ల్టే…ఏపీలోను వ‌స్తుందా..!

మేం సొంతంగా ఎదుగుతాం. మాకూ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తిస్తున్నారు. ప్ర‌ధాని మోడీ ప‌థ‌కాలు మాకు పెద్ద ప్ల‌స్‌. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు, అవినీతికి వ్య‌తిరేక పోరాటం వంటివి మాకు ప్ర‌ధాన బ‌లాలు. ఏపీలో బాబు పంచ‌న ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మోచేతి నీరు తాగాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేదు. ఇక‌, ప‌వ‌న్ నీడ అస్స‌లే అవ‌స‌రం లేదు. 2019 నాటికి మేం బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదుగుతాం. మాద‌గ్గ‌ర‌కే ఇత‌ర పార్టీలు రావాలి. అని నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీరాలు ప‌లికిన ఏపీ బీజేపీ నేత‌ల నోళ్ల‌కు కాకినాడ ప్ర‌జ‌లు గాడ్రేజ్ తాళాలు వేసేశారు.

తాజా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బీజేపీకి ఎంత స‌త్తా ఉందో? దానికి ప్ర‌జ‌ల్లో ఎంత ప‌ర‌ప‌తి ఉందో తేల్చి చెప్పేశారు. ఇక్క‌డ కూడా టీడీపీతో పొత్తుతో రంగంలోకి దిగిన బీజేపీ మొత్తంగా 9 వార్డుల్లో పోటీకి దిగింది. సీట్ల పంప‌కాల స‌మ‌యంలో త‌మ‌కు 9 చాల‌వ‌ని క‌నీసం 20 వార్డులైనా కేటాయించాల‌ని సోమువీర్రాజు పెద్ద హంగామా సృష్టించారు. బాబుపై పోరుకు రెడీ కూడా అయ్యారు. అయితే, ఇంత‌లోనే గ‌డువు ముగియ‌డం, ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం అయిపోయాయి. ఇక‌, ఇప్పుడు వ‌చ్చిన ఫ‌లితాల‌ను చూస్తే.. బీజేపీ ప‌రిస్థితి ఎంత ఘోరంగా ఉదో అర్ధ‌మైపోయింది.

మొత్తం 9 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ కేవ‌లం 3 వార్డుల్లోనే గెలిచింది. ఇక బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మాల‌కొండ‌య్య కూడా 9వ వార్డులో పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి కంప‌ర ర‌మేష్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఈ రిజ‌ల్ట్ చూశాక ఏపీ ప్ర‌జ‌లు కేంద్రంలోని బీజేపీ నేత‌లు ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని ఎక్క‌డా మ‌రిచిపోలేద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కేంద్రంలోని బీజేపీ చేసిన మోసాన్ని ఏ ఒక్క‌రూ హ‌ర్షించ లేక‌పోతున్నార‌న‌డానికి తాజా ఎన్నిక‌ల రిజ‌ల్టే చెబుతోంది. అమ‌రావ‌తి శంకు స్థాప‌న‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ మ‌ట్టి నీరు తెచ్చారే కానీ, బంగారంలాంటి ఒక్క హామీ కూడా ఇవ్వ‌లేక‌పోయారు. ఇదే విష‌యాన్ని ఓట‌ర్లు త‌మ ఓటు ద్వారా బీజేపీకి హెచ్చ‌రిక‌లు పంపారు.

ఏపీకి అన్యాయం చేసిన వాళ్ల‌ను వ‌ద‌లిపెట్టేది లేద‌ని బీజేపీ విష‌యంలోనూ నిజం చేశారు. ఇప్ప‌టికే రాష్ట్రాన్ని విడ‌గొట్టిన కాంగ్రెస్‌కు నిలువ నీడ కూడా లేకుండా చేసిన ఏపీ ప్ర‌జ‌లు.. ఇక‌, ఏపీకి విభ‌జ‌న స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో తీవ్ర నిర్ల‌క్ష్యం, హామీల జంపింగ్ వంటి వాటి విష‌యంలో బీజేపీకి క‌ర్ర‌కాల్చి వాత పెట్టారు. మ‌రి ఈ విష‌యాల‌నైనా సోము వంటి వారు గ్ర‌హించి అధిష్టానానికి చేరిస్తే మంచిద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .