టీడీపీలో ఆయ‌న ఎక్క‌డుంటే అదృష్టం అక్క‌డే!

కొంద‌రికి అదృష్ణం అయ‌స్కాంతం అంటుకున్న‌ట్లు అంటుకుంది. న‌క్క‌తోకను తొక్కితే.. కూడా అలాంటి అదృష్టం రాదు. ముఖ్యం రాజ‌కీయాల్లో ఇలా అదృష్టం ఉన్న‌వాళ్లు చాలా త‌క్కువ మందే ఉంటారు. కానీ ఆయ‌న‌ ఒక‌సారి కాదు రెండు సార్లు కాదు.. రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి వెన‌కాలే నీడ‌లా అదృష్టం తోడుంటోంది. ప‌ట్టింద‌ల్లా బంగారంలా మారుతోంది. ఆగ‌స్టు 15వ తేదీన జాతీయ జెండాను ఎగ‌రేయ‌డం అంటే.. ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. అందులోనూ మంత్రిగా సొంత‌జిల్లాలో ఇలాంటి అవ‌కాశం రావ‌డ‌మంటే నిజంగా అదృష్టముండాలి!! ప్ర‌స్తుతం ఏపీ కేబినెట్లో కాల్వ శ్రీ‌నివాసులుకు ఇలాంటి అరుదైన అదృష్ట‌మే ద‌క్కింది.

సాదాసీదా జర్నలిస్ట్ గా ప‌నిచేసిన కాల్వ శ్రీ‌నివాసులు.. బ‌ల‌మైన సామాజిక వర్గానికి చెందిన‌వారు. ఆ ప్రాతిపదికనే గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన తటస్థులు, మేధావుల కోటాలో అనంతపురం ఎంపీగా టిక్కెట్ సాధించారు. సీనియర్ నేత అనంత వెంకటరామిరెడ్డిపై మొదటి ప్రయత్నంలో అనూహ్య విజయం సాధించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉంటూ చంద్రబాబు సన్నిహితుల్లో ఒకరిగా మారిపోయారు. ఆ తర్వాత వరుసగా ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారు. 2014 జరిగిన ఎన్నికల్లో ఆయన రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కాలవకు చంద్రబాబు చీఫ్ విప్ పదవి ఇచ్చి గౌరవించారు.

ఇక మంత్రివర్గంలో కాలవను అదృష్టం వరించింది. సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణశాఖ మంత్రి పదవి లభించింది. మంత్రివర్గ విస్తరణ సమయంలో సీనియర్ నేత, పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసారథి, మైనారిటీ కోటా నుంచి చాంద్‌బాష పేరు కూడా ప్రముఖంగా వినిపించినా.. కాలవ శ్రీనివాసులుకే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. త‌ర్వాత కర్నూల్ జిల్లా టీడీపీ బాధ్యతలు అప్పగించారు. నిజానికి కర్నూల్ జిల్లా బాధ్యతలను కేంద్రమంత్రి సుజనా చౌదరి చూస్తున్నారు. ఆయ‌న్నుత‌ప్పించి నంద్యాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కాలవకే కర్నూల్ జిల్లా బాధ్యతలు కూడా అప్పగించారు.

ఆగస్టు 15న కర్నూలులో జండా వందనం చేసే బాధ్యత కాలవకే అప్పగించాలి.

సీనియర్ నేత, డిప్యూటీ సీఎంను కాదని కాలవకు ఆ బాధ్యతలు అప్పగిస్తే మ‌రోలా ఉంటుంద‌ని భావించిన టీడీపీ.. కేఈకి జెండా ఆ బాధ్యత అప్పగించింది. అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జెండా వందనం చేయాల్సి ఉంది. కానీఆయ‌న సీఎంతో కలిసి మరో కార్యక్రమంలో పాల్గొనడంతో అనంతపురంలో జెండా వందనం చేసే అవ‌కాశం కాలవకు దక్కింది. అనంతలో పుట్టి, జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాల్లో రాణిస్తున్న ఆయ‌న ఆగస్టు 15న అక్కడ జెండా వందనం చేశారు. `కాలవ శ్రీనివాసులు అదృష్టవంతుడండీ! అందుకే ఆయన ఎక్కడ ఉన్నా అదృష్టం ఆయన ఇంటి తలుపు తడుతోంది` అని పార్టీ నేతలు చెబుతున్నారు.