పార్టీ మార‌డంపై కామినేని ఒక్క‌సారిగా బర‌స్ట్

బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస‌రావుపై గ‌త కొంత కాలంగా ఆయ‌న పార్టీ మార‌తాడ‌ని, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతాడ‌ని, అందుకే ఏపీలో బీజేపీ ఏమైపోయినా ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి. అంతేకాదు, ఇటీవ‌ల కాలంలో కొన్ని మీడియాల్లో అయితే, కామినేని చూపు టీడీపీ వైపు అంటూ క‌థ‌నాలు వ‌చ్చేశాయి. ఈ జోరు రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో త‌ట్టుకోలేక పోయారో ఏమో .. కామినేని ఒక్క‌సారిగా బర‌స్ట్ అయిపోయారు.

తాను ఎట్టి ప‌రిస్థితిలోనూ పార్టీ మారేది లేద‌ని క్లారిటీ ఇచ్చేశారు. అంతేకాదు, త‌న పార్టీ బీజేపీని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆకాశానికి ఎత్తేశారు. అదేస‌మ‌యంలో కొంత సెంటిమెంటును కూడా రంగ‌రించేశారు. అస‌లింత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే..

“ప్రాణమున్నంతవరకూ నేను బీజేపీలోనే ఉంటా పార్టీ మారే ప్రసక్తేలేదు.. నేను ఈ స్థాయిలో ఉండటానికి బీజేపీ పార్టీయే కారణం.. వెంకయ్యనాయుడు వల్లే నేను ఈ స్థాయిలో వున్నాను.. నాకు ప్రజలు అందించిన 5సంవత్సరాల అధికార కాలంలో ప్రజలకు సేవ చేస్తా.. నేను ఎవరికీ శత్రువుని కాను.. అందరితో కలిసిమెలిసి ఉంటాను” అని మంత్రి నొక్కి చెప్పారు.

వాస్త‌వానికి.. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బీజేపీ ప‌రిస్థితి గ‌మ‌నిస్తే.. మంత్రిగా ఉన్న కామినేని ఏమీ ప‌ట్టించుకోలేద‌నే అనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా మారిన వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోయిన త‌ర్వాత రాష్ట్రంలో బీజేపీకి నాథుడు లేడా? అనిపించే స్థాయికి చేరిపోయింది. ఇక‌, గ‌తంలోనూ బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ త‌గిన విధంగా మ‌ర్యాద చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బీజేపీ నేత‌లే భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆ స‌మ‌యంలోనూ కామినేని త‌గిన విధంగా స్పందించ‌లేదు. దీంతో ఆయ‌న బీజేపీనా.. లేక టీడీపీ మ‌నిషా అనే రేంజ్‌కి చ‌ర్చ‌లు చేరిపోయాయి. ఈ క్ర‌మంలోనే కామినేని పార్టీ మార్పుపైనా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఏదేమైతేనేం.. ఆయ‌న ఇచ్చిన క్లారిటీతో కొంత వ‌ర‌కు ఇలాంటి వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం ఖాయం.