కామినేని మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెడుతోందెవ‌రు..!

August 21, 2017 at 6:19 am
kamineni srinivas rao

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పదా ? అన్న ప్ర‌శ్న‌కు ఇప్పుడు ఏపీ బీజేపీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ‌, ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం కామినేని మంత్రి ప‌ద‌వికి ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ‌లు బ‌లంగా న‌డుస్తున్నాయి. కామినేని శ్రీనివాస్‌ను ముందునుంచి ఏపీ బీజేపీ వాళ్లంతా చంద్ర‌బాబు కోవ‌ర్ట్‌గా అనుమానిస్తుంటారు.

గ‌తంలో టీడీపీతో అనుబంధం ఉన్న కామినేని శ్రీనివాస‌రావు ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ఆయ‌న కైక‌లూరులో పోటీ చేయ‌డం వెన‌క చంద్రబాబు గైడెన్స్ పూర్తిగా ఉంద‌న్న‌ది కూడా ఓపెన్ సీక్రెట్‌. కామినేని కోసం చంద్ర‌బాబు బీసీ వ‌ర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ‌ను కూడా త‌ప్పించేశారు.

ఆ త‌ర్వాత కామినేనికి చంద్ర‌బాబు బీజేపీ కోటాలో మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అప్ప‌టి నుంచి కామినేని చంద్ర‌బాబు కోవ‌ర్ట్ అని ఏపీ బీజేపీలో వెంక‌య్య యాంటీ వ‌ర్గం ఆయ‌న్ను పూర్తిగా న‌మ్మ‌డం లేదు. ఇక త్వ‌ర‌లో జ‌రిగే కేంద్రమంత్రి వర్గ విస్తరణలో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గాని, రాం మాధవ్‌కు గాని అవకాశం ఉండవచ్చన్న వార్తలు వస్తున్నాయి.

రాం మాధ‌వ్ మంత్రిగా ఉండేందుకు ఇష్ట‌ప‌డం లేద‌ట‌. దీంతో కంభంపాటి హరిబాబుకు కేంద్రమంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం కూడా జరగనుంది. ఈ అధ్యక్ష పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు పోటీ పడుతున్నారు.

ఇక ఇటు పురందేశ్వ‌రికి ఏపీ బీజేపీ ప‌గ్గాలు అప్ప‌గించి, అటు కంభంపాటి హ‌రిబాబుకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తే వీరిద్ద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు అవుతారు. ఈ క్ర‌మంలోనే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన కామినేనిని ఏపీ కేబినెట్ నుంచి త‌ప్పించి ఆయ‌న స్థానంలో సోము వీర్రాజు లేదా అదే కాపు వ‌ర్గానికి చెందిన రాజ‌మండ్రి అర్బ‌న్ ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా కామినేనిని మంత్రి ప‌ద‌వికి పార్టీయే ఎస‌రు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

కామినేని మంత్రి ప‌ద‌వికి ఎస‌రు పెడుతోందెవ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts