ఏపీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ అవుటా… అస‌లేం జ‌రిగింది..!

కాపు ఉద్య‌మ ప్ర‌భావం నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఉంటుంద‌ని భావించినా.. వారంతా టీడీపీకి ప‌ట్టం క‌ట్టారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కాపుల‌కు ఇచ్చిన హామీలో భాగంగా.. వారి అభివృద్ధికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటుచేశారు. ఆశించిన స్థాయిలో ల‌క్ష్యాలు అందుకునేలా చేయ‌డంలో కార్పొరేష‌న్ విఫ‌ల‌మైంది. దీంతో పాటు ఈ కార్పొరేష‌న్‌లో అవక‌త‌వ‌క‌లు కూడా చోటు చేసుకుంటుండటంతో దీని ప్ర‌క్షాళ‌న‌పై సీఎం దృష్టిసారించారు. కీల‌క‌మైన కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని మ‌రొక‌రికి అప్ప‌గించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

కాపు కార్పొరేష‌న్‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అవినీతికి అడ్డుక‌ట్ట వేసి.. సేవ‌లు మ‌రింత విస్తృతం చేయాల‌ని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా కాపు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రుణ సౌకర్యంతో పాటు కాపు విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్ లను ఇస్తున్నారు. అయితే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండేళ్లు గడుస్తున్నా అనుకున్న పురోగతి సాధించలేదని సీఎం భావిస్తున్నార‌ట‌. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ ఛైర్మన్ రామాంజ‌నేయులు వ్య‌వ‌హార‌శైలిపైనా అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే

ప్రధానంగా నంద్యాల, కాకినాడల్లో కాపు ఓటర్లు తెలుగుదేశం పార్టీ తరుపున నిలబడటంతో కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. కొద్దికాలంగా కార్పొరేషన్ లో పెద్దయెత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్ ఎండీ అమరేంద్ర కుమార్ పై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ కమిటీని కూడా నియమించింది. ఎండీని మార్చాలని ముఖ్యమంత్రి మూడు రోజుల నుంచి చెబుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

నిఘా వర్గాలు, పార్టీ నేతలు అందించిన సమాచారం ప్రకారం కాపు కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టినట్లు తెలియడం తో ప్రభుత్వం వెంటనే ఎండీని మార్చేయాలని భావిస్తోంది. ఎండీని సీనియర్ మంత్రి ఒకరు కాపాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగుస్తుండటంతో ఛైర్మన్ మార్చేయాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో రామాంజ‌నేయులు స్థానంలో చందు సాంబశివరావును గానీ, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను గాని నియమించే అవకాశా లున్నాయ‌ట‌. మొత్తానికి కాపుకార్పొరేష‌న్ ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ధ‌మైనట్టే!