వైసీపీలో కీల‌క వికెట్ డౌన్‌

వ‌రుస క‌ష్టాల‌తో విల‌విల్లాడుతోన్న ఏపీ విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. కీల‌క‌మైన విశాఖ న‌గ‌రానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే క‌ర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్ప‌పేశారు. గ‌త ఎన్నిక‌ల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన సీతారాం జ‌గ‌న్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

పార్టీ వీడుతున్న సంద‌ర్భంగా మీడియా స‌మావేశం పెట్టిన ఆయ‌న జ‌గ‌న్‌పై తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే కేవ‌లం డ‌బ్బు మాత్ర‌మే ఉండాల‌న్న‌ది జ‌గ‌న్ ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని అందుకే పార్టీలో త‌న‌ను తీవ్రంగా అవ‌మానిస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు తెలియ‌కుండానే భీమిలి నియోజ‌క‌వ‌ర్గానికి మ‌రో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను నియ‌మించార‌ని…ఇది త‌నకు చాలా బాధ క‌లిగించింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

2014 ఎన్నిక‌ల్లో తాను త‌న‌కు ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకుని ఎన్నిక‌ల్లో పోటీ చేశాన‌ని, ఇప్పుడు త‌న వ‌ద్ద డ‌బ్బులు లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ మ‌రో వ్య‌క్తిని చూసుకున్నార‌ని సీతారాం తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుతం టీడీపీ త‌ర‌పున మంత్రి గంటా శ్రీనివాస‌రావు ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గంటాను ఢీకొట్టాలంటే సీతారాం వ‌ల్ల సాధ్యం కావ‌డం లేద‌ని భావించిన జ‌గ‌న్ రెండో ఇన్‌చార్జ్‌ను నియ‌మించారు. దీంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన సీతారాం జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి…పార్టీకి గుడ్ బై చెప్పేశారు.