టీఆర్ఎస్‌లో ఏదో జ‌రుగుతోందా..?

తన త‌ర్వాత సీఎం పీఠం కొడుకు, లేదా కూతురికి అప్ప‌గిస్తున్న వారే ఎక్కువ‌మంది క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో ఈ వార‌స‌త్వ రాజ‌కీయం ప్ర‌ధానంగా మారిపోయింది. సీఎం పీఠానికి ఎవ‌రైనా అడ్డొస్తున్నార‌ని తెలిస్తే.. వారిని వెంట‌నే ప‌క్కకు తొల‌గించేస్తున్న రోజులివి. ఇప్పుడు తెలంగాణ‌లోనూ ఇదే ప‌ద్ధ‌తి క‌నిపిస్తోంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణ‌యాలు చూసిన వారంతా ఇదే చెబుతున్నారు. మేన‌ల్లుడు హ‌రీశ్‌రావు ప్రాధాన్యం త‌గ్గించి.. కొడుకును వీలైనంతగా ప్రొజెక్టుచేయాల‌ని చూస్తున్నారు కేసీఆర్‌. అంతేగాక వీలైనంత‌గా ప్ర‌జ‌ల్లో ప‌ట్టు సాధించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఏం చెబితే అది చేస్తాన‌ని, సీఎంగా కేటీఆర్ ఉన్నా పూర్తి స‌హ‌కారం అందిస్తాన‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఇటీవ‌ల స్ప‌ష్టంచేశారు. అయినా ఇంకా కేసీఆర్‌కు ఏమూల‌నో అనుమానం తొలగిన‌ట్లు లేదు. అందుకే కేటీఆర్‌ను వీలైనంతంగా ప్ర‌జ‌ల్లో చొచ్చుకుపోచేలా చేసేందుకు స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణలో మరో పదేళ్లు టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేసే వాళ్లు ఎందుకింత హైరానా పడుతున్నారు. యువనేతగా…భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న కెటీఆర్ వరస పెట్టి ఎందుకు సభలు..సమావేశాలు ఎందుకు పెడుతున్నారు. అంటే దానికి కార‌ణ‌మూ లేక‌పోలేద‌ట‌.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కెసీఆర్ పాత్ర ఎంత ఉందో.. పార్టీ నిర్మాణంలో ఇటుక ఇటుక పేర్చటంలో హరీష్ రావుదీ అంత కీలకపాత్ర. ప్రతి జిల్లా నాయకులు..కార్యకర్తలతో హరీష్ రావుకు ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికితోడు ఎంతో సహనంతో అందరూ చెప్పేది వినే ఓపిక హరీష్ సొంత. ఉద్యమ చివరి దశలోనే కెటీఆర్ అమెరికాలో చేస్తున్న ఉద్యోగం మానేసి ఉద్యమంలోకి దూకారు. అప్పటి నుంచి పార్టీలోనే యాక్టివ్ గా ఉన్నా.. హరీష్ కు ఉన్నంత బలమైన మూలాలు కెటీఆర్ కు లేవు. ఇదే ఇప్పుడు కేసీఆర్ టెన్షన్. అందుకే పార్టీ నాయకుల్లో.. ప్రజలతో మమేకం కావటానికి కేటీఆర్ ను సమావేశాల పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టిస్తున్నారని ఓ నాయకుడు విశ్లేషించారు.

ఎంతైనా కేటీఆర్‌కి సెట్ అయ్యేలా హైఫై నాయకుడిలా ఉంటారే తప్ప…హరీష్ రావు లా క్షేత్రస్థాయి నాయకుడు కావటం కష్టం అని ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. వ్యూహాల అమలులో కూడా కేటీఆర్ హరీష్ తో పోటీపడలేరు. ఆ సంగతి కేసీఆర్ కూ తెలుసు. అందుకే రాజకీయ రణరంగంలో తన కొడుకును మరింత రాటు తేల్చేందుకు ప్రయత్నిస్తూనే.. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కెసీఆర్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి హరీష్ రావు దగ్గర ఉన్న నీటిపారుదల శాఖను కేసీఆర్ తన దగ్గర పెట్టుకుంటారని..హరీష్ కు మరోశాఖ ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.