రైతుల‌కు బేడీలు.. దిగొచ్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణ‌మైన ఖ‌మ్మం రైతుల‌కు బేడీల వ్య‌వ‌హారంపై సీఎం కేసీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. త‌న‌ను తాను ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకున్న ఈ వ్య‌వ‌హారం నుంచి చాలా సున్నితంగా త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని కేసీఆర్ మంత్రి వ‌ర్గం తీవ్రంగా ఖండించి, దానిని త‌ప్పేన‌ని ఒప్పుకుంది. అదేసమయంలో బాధ్యులైన ఇద్ద‌రు ఎస్పైల‌ను సస్పెండ్ చేసింది. అయితే, కేసీఆర్ మాత్రం.. ఇది ఉద్దేశ పూర్వ‌కంగా జ‌రిగిందికాద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, రైతాంగాన్ని ఊర‌డించేందుకు పాట‌లు, మాట‌ల‌తో పెద్దె ఎత్తున ప్ర‌చారం చేస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మంలో రైతుల చేతీలకు బేడీలు వేయడం తప్పు అని పేర్కొన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందిన కాదని చెప్పిన కేసీఆర్ ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు ఇక మా భవిష్యత్తుకు ఢోకా లేదనే భరోసా రైతాంగంలో కలిగే విధంగా పాటలు రాయాలని వీడియో చిత్రాలు రూపొందించాలని రచనలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

ఇప్పటికే రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని పథకాలు తెస్తున్నామని అవన్నీ సక్రమంగా అమలు చేసే బాధ్యతను రైతు సంఘాలకు అప్పగిస్తామని సీఎం వెల్లడించారు. రైతు స్వర్ణ యుగానికి రైతు సంఘాలే నిచ్చెన మెట్లు కావాలని అవి నిజాయితీగా పని చేయాలన్నారు. వ్యవసాయం బాగు పడి రైతు ధైర్యంగా ఉండడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉండడం కోసం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కోరారు. అయితే, కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు ధ్వ‌జ‌మెత్తాయి. మాట‌లు, పాట‌ల‌తో రైతుల‌ను ఎన్నాళ్లు మ‌భ్య‌పెడ‌తార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి కేసీఆర్ ఏం చెబుతారో చూడాలి.