కేసీఆర్‌కు ఎక్క‌డో టెన్ష‌న్…అది హరీశేనా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో గ‌త రెండేళ్లుగా వార‌స‌త్వ పోరు తీవ్రంగానే జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో హ‌రీశ్‌రావుకు ఉన్న ప్రాధాన్యం ఎన్నిక‌ల త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. కేసీఆర్ సైతం అల్లుడు కంటే కొడుకు కేటీఆర్‌కే కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో రాష్ట్ర‌స్థాయిలో చ‌క్రం తిప్పిన హ‌రీశ్ ఇప్పుడు సిద్ధిపేట‌, మెద‌క్ జిల్లాల‌కు ప‌రిమిత‌మైపోవాల్సి వ‌చ్చింది.

ముఖ్యంగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల త‌ర్వాత కేటీఆర్ క్రేజ్ మామూలుగా లేదు. ఆ త‌ర్వాత వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌తో పాటు వ‌రంగ‌ల్ ఎంపీ, పాలేరు ఉప ఎన్నిక బాధ్య‌త‌లు కూడా కేసీఆర్ కేటీఆర్‌కే అప్ప‌గించారు. ఈ ఎన్నిక‌ల‌న్నింటిలోను టీఆర్ఎస్ విజ‌యం సాధించ‌డంతో తెలంగాణ‌లో రాజ‌కీయ‌ప‌రంగాను, ప్ర‌భుత్వ ప‌రంగాను కేటీఆర్ క్రేజ్ పీక్స్‌కు చేరిపోయింది.

ఇక ఈ టైంలో హ‌రీశ్‌రావు ఒక్క ఖేడ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మాత్ర‌మే టీఆర్ఎస్‌ను గెలిపించారు. ఆ త‌ర్వాత కూడా కేటీఆర్ హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్, విదేశీ పెట్టుబ‌డులంటూ నానా హంగామా చేయ‌డంతో కేటీఆర్ దూకుడు ముందు హ‌రీశ్ తేలిపోతూ వస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న రాజ‌కీయ వార‌సుడిగా కుమారుడికి కేసీఆర్ మంచి ప్లాట్ ఫాం వేస్తున్నార‌ని, ఈ క్ర‌మంలోనే హ‌రీశ్ ప్రాధాన్య‌త‌ను వ్యూహాత్మ‌కంగా త‌గ్గిస్తూ వ‌స్తున్నార‌న్న చ‌ర్చ‌లు సైతం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించాయి.

అయితే రెండు నెల‌లుగా మాత్రం కేసీఆర్ హ‌రీశ్‌కు విప‌రీత‌మైన ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. తాజాగా జ‌రిగిన కొండ‌పాక స‌భ‌లో సైతం హ‌రీశ్‌పై పొగ‌డ్త‌లు కురిపించారు. త‌న ఆశ‌య‌సాధ‌న‌లో హ‌రీశ్ ఎంతో కీల‌క‌మ‌ని త‌న అభివృద్ధి వెన‌క హ‌రీశ్ ప్రాధాన్య‌త ఎంతో మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పారు. కేసీఆర్ మ‌రోసారి హ‌రీశ్ విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి టీఆర్ఎస్‌ను గెలిపించుకునేందుకు ర‌క‌ర‌కాల వ్యూహాలు ప‌న్నుతోన్న ఆయ‌న హ‌రీశ్ త‌న అసంతృప్తిని ఎక్క‌డ బ‌య‌ట‌పెడ‌తాడోన‌న్న ఆందోళ‌న‌తో ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. హ‌రీశ్ అసంతృప్తి బ‌య‌ట‌కు వ‌స్తే అది రాజ‌కీయంగా టీఆర్ఎస్‌, కేసీఆర్‌కు పెద్ద దెబ్బే. కేసీఆర్‌ను అణ‌గ‌దొక్కేందుకు కాచుకుని కూర్చొన్న ఇత‌ర పార్టీల‌కు ఇది పెద్ద వ‌రం అవుతుంది. ఈ క్ర‌మంలోనే హ‌రీశ్‌ను కేసీఆర్ దువ్వుతున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సైతం హరీశ్ వర్గానికి కూడా కేసీఆర్ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే..! ఓవ‌రాల్‌గా కేసీఆర్‌కు ఎక్క‌డో హ‌రీశ్ టెన్ష‌న్ అయితే ఉన్న‌ట్లే ఉంది.