కేసీఆర్‌కి కోప‌మొచ్చింది.. ముగ్గురు మంత్రుల‌పై ఫైర్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప‌ట్ట‌లేని ఆగ్ర‌హం వ‌చ్చింద‌ని టీఆర్ ఎస్ భ‌వ‌న్ కోడైకూస్తోంది! ఆ ఆగ్ర‌హం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌మీదో కాద‌ట‌. ఏకంగా త‌న కేబినెట్‌లోని కీల‌క శాఖ‌లు చూస్తున్న మంత్రుల పైనేన‌ట‌. ముఖ్యంగా ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌నల నేప‌థ్యంలో ఓ ముగ్గురు మంత్రుల‌పై గులాబీ ద‌ళ‌ప‌తి సీరియ‌స్ అయ్యార‌ని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖ‌సురు కున్నార‌ని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు నేత‌లు. విష‌యంలోకి వెళ్తే.. గ‌త కొన్నాళ్లుగా మంత్రులు ఏ విష‌యంపైనా స్పందించ‌డం లేదు. ఏ విష‌యంపైనైనా.. ఏం మాట్లాడితే.. ఏం తంటా వ‌స్తుందోన‌ని వారు స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ట‌.

దీంతో మంత్రులంతా మూగ‌నోము పాటించారు. అయితే, ఈ వారంలో రాష్ట్రంలో అత్యంత కీల‌క‌మైన ప్ర‌జాసంబంధ‌మైన విష‌యాలు మూడు చోటు చేసుకున్నాయి. వీటివ‌ల్ల ప్ర‌భుత్వానికి బ్యాడ్ నేమ్ వ‌చ్చింది. ఆ యా విష‌యాల్లో ఆ శాఖ‌ల‌ను డీల్ చేస్తున్న మంత్రులు స‌త్వరం స్పందించ‌లేదు. దీంతో కేసీఆర్ ఒక్క‌సారిగా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇటీవ‌ల ఖ‌మ్మంలో శిశువులు వరుస పెట్టిమ‌ర‌ణించారు. అది కూడా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో.. అయినా కూడా మంత్రి ల‌క్ష్మా రెడ్డి స్పందించ‌లేదు. అదేవిధంగా హైద‌రాబాద్‌లోని సంప‌న్న ప్రాంతం బీహెచ్ ఎల్‌లోని ఓ స్కూలులో విద్యార్థి పట్ల యాజమాన్యం అమానుషంగా ప్ర‌వ‌ర్తించింది.

ఒక విద్యార్థిని యూనిఫాం వేసుకురాలేదని బాలుర మరుగుదొడ్ల వద్ద నిలబెట్టారు. దీంతో త‌ల్ల‌దండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. మ‌రోఘ‌ట‌న‌లో డ్వాక్రా సరస్ టెంట్లు కూలి ఇద్దరు కార్మికులు మరణించారు. ఈ మూడు ఘ‌ట‌న‌ల్లోనూ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపించింది. వారు తీవ్ర ఆవేద‌నతో రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా అని ప్ర‌శ్నించే వ‌ర‌కు విష‌యం వెళ్లింది. అప్ప‌టికి కూడా సంబంధిత మంత్రులు ఎవ‌రూ స్పందించ‌లేదు. అయితే, స్కూల్ విష‌యంలో మంత్రి కేటీఆర్ దాకా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయ‌న స్పందించారు.

వాస్త‌వానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి స్పందించాల్సి ఉన్నా.. ఆయ‌న ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాడ‌ట‌. బాధితుల ప‌క్షాన కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కడియం చర్యలకు దిగడం విమర్శలకు తావిచ్చింది. మంత్రులు వెంటనే స్పందించకపోవడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆరా తీసినట్లు సమాచారం. మొత్తం మీద ఈ ముగ్గురు మంత్రుల పనితీరు సక్రమంగా లేదని తేలడంతో వారిపై సీరియ‌స్ అయ్యార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.