టీఆర్ఎస్‌లోనూ టీడీపీ నేత‌లకే ప‌ట్టం..!

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో వింత సంస్కృతి క‌నిపిస్తోంది. మ‌న రాష్ట్రం.. మ‌న పాల‌న పేరుతో ఆవిర్భ‌వించిన టీఆర్ ఎస్ అన‌తి కాలంలోనే రాష్ట్రాన్ని సాధించ‌డంతోపాటు కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో టీఆర్ ఎస్ అధికారంలోకి కూడా వ‌చ్చింది. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. టీడీపీ మూలాలున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు మ‌ళ్లీ టీడీపీ గూటి ప‌క్షుల‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నార‌ని, తెలంగాణ సాధ‌న కోసం టీఆర్ ఎస్ లో ప‌నిచేసిన వారిని గుర్తించ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది.

నిజానికి టీఆర్ ఎస్ పార్టీని చూస్తూ,., మ‌రో టీడీపీ అని అనిపించ‌క మాన‌దు. అన్న‌గారి హ‌యాంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న కేసీఆర్ ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనూ ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న చిన్నాపాటి గొడ‌వ‌ల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చి సొంత పార్టీ పెట్టు కున్నాడు. ఇక‌, ఆ త‌ర్వాత తెలంగాణ‌లో టీడీపీ నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా కేసీఆర్ గూటికి చేరారు. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్‌లో ఉన్న హేమాహేమీ లంతా ఒక‌ప్పుడు టీడీపీలో చ‌క్రం తిప్పిన నేత‌లే.

టీడీపీని నామ‌రూపాలు లేకుండా చేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఆ పార్టీలోని వారిని చేర్చుకోవ‌డం ద్వారా పార్టీ ఉనికిని దెబ్బ‌తీసినా.. ఆ పార్టీ నుంచి వ‌చ్చి టీఆర్ ఎస్ కారెక్కిన వారికి మాత్రం ప‌ప్పుబెల్లాల వంటి ప‌ద‌వులు అప్ప‌జెపుతున్నారు. ఇప్ప‌టికే డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి, మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వంటి వారు టీడీపీలో చ‌క్రం తిప్పిన నేత‌లే. ఇక ఇప్పుడు తాజాగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఎనిమిది కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను నియ‌మించారు.

వీరిలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది గుండు సుధారాణి. ఈమె కూడా టీడీపీ ఎంపీగా గ‌తంలో ఎంతో ప్రాచుర్యం పొందారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఆమెను గ‌తంలో చంద్ర‌బాబు టీడీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పంపారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ ఆక‌ర్ష్ వ‌ల‌లో ప‌డిన ఆమె పార్టీ మారారు. ఇప్పుడు ఆమెకు కేసీఆర్ ఈ రెండు ప‌ద‌వులు ఇచ్చారు. ఏదేమైనా టీఆర్ఎస్‌లో సైతం టీడీపీ జంపింగ్‌ల‌కే మంచి ప్ర‌యారిటీ ఉన్న పోస్టులు ద‌క్కుతున్నాయి.