త‌న స‌ర్వేతో.. హ‌రీశ్‌ని వెన‌క్కి నెట్టిన కేసీఆర్‌

తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు. ఇద్ద‌రూ కూడా టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌కి ఒక‌రు కొడుకు, మ‌రొక‌రు మేన‌ల్లుడు! అయితే, ఇట‌వ‌ల కాలంలో హ‌రీశ్ రావు హ‌వా పెరుగుతోంద‌ని కొన్ని ప్రైవేటు స‌ర్వేలు చాటాయి. దీనికి మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ మిష‌న్ వంటి కార్య‌క్ర‌మాలు భారీగా తోడ్ప‌డ్డాయ‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇక‌, అదేస‌మ‌యంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుక‌బ‌డ్డార‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీనికి.. హైద‌రాబాద్‌లో మురుగునీటి పారుద‌ల‌, పారిశుధ్యం, రోడ్లు, వర్షాలు వంటివి కార‌ణంగా క‌నిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌తో ఒక్క‌సారిగా హ‌రీశ్ హీరో అయిపోయి.. కేటీఆర్‌ను వెన‌క్కి నెడుతున్నారా? అని అనిపించింది. అంతేకాదు, హ‌రీశ్ రావుకు సిద్ధిపేట‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక‌, కేటీఆర్‌కి సిరిసిల్ల‌లోనూ ఫాలోయింగ్ ఉన్న‌ప్ప‌టికీ.. హ‌రీశ్ క‌న్నా త‌క్కువ‌నే వార్త‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ అధికారికంగా సీఎంగా తాను స‌హా మంత్రులుగా ఉన్న వారిపై స‌ర్వే చేయించారు. ప‌నితీరు ఆధారంగా మార్కులు, ర్యాంకులు ప్ర‌క‌టించారు. దీని ప్ర‌కారం.. చూస్తే.. కేసీఆర్ ఫ‌స్ట్‌, కేటీఆర్ సెకండ్‌, హ‌రీశ్ థ‌ర్డ్ వ‌చ్చారు. అంటే కేటీఆర్, హ‌రీశ్ ల మ‌ధ్య చూస్తే.. కేటీఆర్ ఫ‌స్ట్‌, హ‌రీశ్ సెకండ్ వ‌చ్చార‌న్న‌మాట‌!!

కేసీఆర్ వెల్ల‌డించిన ర్యాంకుల ప్ర‌కారం… సీఎం స్కోరు 98 శాతం, ఐటీ, మున్సిపల్‌ వ్యవహారాల శాఖమంత్రి కేటీఆర్‌ 91శాతం, భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావుకు 88 శాతం వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ స‌ర్వే ఫ‌లితాల‌పైనే పాలిటిక్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌జ‌ల్లో హ‌రీశ్‌కి మంచి ఫాలోయింగ్ ఉంద‌ని, కానీ స‌ర్వేల్లో మాత్రం ఆయ‌న‌కు త‌క్కువ మార్కులు ఎందుకు వ‌చ్చాయ‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇది కావాల‌నే జ‌రిగిన విష‌యంగా వారు పేర్కొంటున్నారు. హ‌రీశ్‌రావు దూకుడుకి.. చెక్ పెట్టాల‌నే ఉద్దేశంతోనే ఏదో జ‌రిగింద‌నే వ్యాఖ్య‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి నిజాలు.. దేవుడికెరుక అని స‌రిపెట్టుకుంటున్నారు.