స్వీయ ప‌రీక్ష‌కు కేసీఆర్ వెన‌క్కి!

తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. గొర్రెలు, బ‌ర్రెలు పంచి జ‌నాన్ని ఉద్యోగాల గోల నుంచి త‌ప్పించినా.. మ‌హిళ‌ల‌కు చీర‌లు పంచి అనేక స‌మ‌స్య‌ల‌కు మ‌సి పూసినా.. కేసీఆర్‌కే చెల్లింది. ఇక‌,తాజాగా త‌న‌పై విరుచుకుప‌డుతున్న కాంగ్రెస్‌, బీజేపీ స‌హా విప‌క్షాల‌కు ఫీజు పీకేయాల‌ని నిర్ణ‌యించుకున్న కేసీఆర్‌.. ఈ క్ర‌మంలో త‌న‌కు తానే ప‌రీక్ష పెట్టుకోవాల‌ని భావించారు. న‌ల్ల‌గొండ ఎంపీ సీటును ఖాళీ చేయించి ఉప ఎన్నిక నిర్వ‌హించ‌డం ద్వారా త‌న స‌త్తా చాటాల‌ని అనుకున్నారు. ఈ ప‌రిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే, అనూహ్యంగా కేసీఆర్ ఈ నిర్ణ‌యం నుంచి వెన‌క్కి త‌గ్గిన‌ట్టు స‌మాచారం. గత ఆదివారం ప్రగతి భవన్ లో పాడి ఉత్పత్తిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేసీఆర్ గుత్తాను కూడా ఆహ్వానించారు. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ గుత్తాతో ప్రత్యేకంగా సమావేశమయినట్లు తెలిసింది. రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ గా మిమ్మల్నే నియమిస్తానని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంద‌ర్భంగా వీరిద్దరి మధ్య రాజీనామా వ్యవహారమేదీ చర్చకు రాలేదని తెలిసింది. గుత్తా చేత అనవసరంగా రాజీనామా చేయించటం ఎందుకన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సాధారణ ఎన్నికలకు కేవ‌లం 19 నెలల సమయం మాత్రమే ఉండటంతో అనవసరంగా మంత్రులు, ఎమ్మెల్యేలను టెన్షన్ పెట్టడం ఎందుకని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. కాంగ్రెస్ కు పట్టున్న నల్లగొండలో ఉప ఎన్నిక రిస్క్ అనవసరమని కూడా ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జోడు పదవులు ఉండటంలో తప్పేమీ లేదని కేసీఆర్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది.

గతంలో కేవీపీ రామచంద్రరావు రాజ్యసభ సభ్యుడిగా ఉండి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అలాగే కనుమూరి బాపిరాజు ఎంపీగా ఉండి టీటీడీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ రెండు కేబినెట్ ర్యాంకులే అయినప్పుడు గుత్తాకు ఎందుకు అడ్డం వస్తాయని సీఎం సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ప్ర‌స్తుతానికి తెలంగాణలో ఉప ఎన్నిక హోరు, జోరు త‌గ్గింద‌ని భావిస్తున్నారు. మ‌రి కేసీఆర్ మ‌నోగ‌తం ఎప్పుడు బ‌య‌ట‌పెడ‌తారో చూడాలి.