మియాపూర్ భూ కుంభకోణం… డిప్యూటీ సీఎంకు చెక్

మియాపూర్ భూ కుంభ‌కోణం.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ కుంభ‌కోణంలో పెద్ద‌ల పాత్ర ఉందంటూ.. ఇప్ప‌టికే అత్యంత కీల‌క‌మైన కేసుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు టీడీపీ ఏపీ ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి అరెస్టు ఉదంతం మ‌రింత ఊపు తెచ్చింది. ఇక‌, సాధార‌ణంగా పైపైనే శోధిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీ స్థాయి వ్య‌క్తిని అరెస్టు చేశారంటే.. దీనిని మ‌రింత సీరియ‌స్‌గా శోధిస్తే.. ఇంకెంత మంది బ‌డా బాబులు బ‌య‌ట‌కు వ‌స్తారో క‌దా! ఇప్పుడు ఇదే విష‌యంపై తెలంగాణ‌లో చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, ఇప్పుడు అంద‌రికీ షాక్ ఇస్తూ.. సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తెలంగాణ రెవెన్యూ వ్య‌వ‌హారాలు చూస్తున్న డీప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ ని డ‌మ్మీ చేశార‌ట కేసీఆర్‌. ఆయ‌న ద‌గ్గ‌రున్న ప‌వ‌ర్స్‌ని పూర్తిగా కేసీఆర్ లాగేసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ దొరికిపోవ‌డంతో ప‌రిస్థితి తీవ్రంగా మారింద‌ని భావించిన సీఎం.. మొత్తం త‌న చేతుల మీదుగానే కేసు న‌డ‌వాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే మియాపూర్ వ్య‌వ‌హారానికి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని త‌న‌కు చెప్పాల‌ని, నివేదిక‌లు నేరుగా త‌న‌కే పంపాల‌ని సీఎం హుకుం జారీ చేసిన‌ట్టు తెలిసింది. దీనిని ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్న రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శిని నేరుగా త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి వివ‌రించాల‌ని కూడా కేసీఆర్ ఆదేశించార‌ట‌. ఇలాగైతేనే.. ఈ భూ కుంభ‌కోణానికి సంబంధించిన విచార‌ణ స‌జావుగా సాగుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మిగిలిన వారితో ప‌రిశీలిస్తే.. విచార‌ణ ప‌క్క‌దారి ప‌డుతుంద‌ని, ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని కూడా కేసీఆర్.. ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది! ఏదేమైనా.. కేసీఆర్ ముందస్తు వ్యూహంతోనే వెళ్తున్నార‌ని అనిపిస్తోంది.