మీడియాకు కేసీఆర్ కూల్ వార్నింగా..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాట‌ల మాంత్రికుడ‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నా…రాజ‌కీయ చ‌తుర‌త క‌లిగిన నాయ‌కుడ‌ని, అభిమానులు అన్నా…ఈ గులాబీ బాస్ స్టైలే సెప‌రేటు. ప్ర‌తిప‌క్షాలు, మిత్ర‌ప‌క్షాలు, సొంత పార్టీ నేత‌లు…ఇలా ఎవ‌రినైనా స‌రే మాట‌ల‌తో క‌ట్టిప‌డేసే నైజం ఆయ‌న‌కే సొంతం. ఈ విష‌యంలో మీడియా కూడా మిన‌హాయింపు కాదు. ఆ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా క్యాబినెట్ స‌మావేశం అనంత‌రం ప్రెస్ మీట్ లో మాట్లాడిన కేసీఆర్ మీడియాను హ్యాండిల్ చేసిన విధాన‌మైతే అదుర్స్ అని చెప్పొచ్చు. ఒక్క రిపోర్ట‌రూ కేసీఆర్ ను స‌రైన ప్ర‌శ్న అడ‌గ‌లేకపోయాడ‌నడంలో ఎటువంటి డౌట్ లేదు.

ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు, పార్టీ ప్లీన‌రీ స‌మావేశాలు, వ‌రంగ‌ల్ లో జ‌ర‌ప‌బోయే బ‌హిరంగ స‌భ త‌దిత‌ర అంశాల‌పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. రిపోర్ట‌ర్లు ప్ర‌శ్న‌లు సంధించారు. కానీ వాటికి చాలా ఈజీగా స‌మాధాన‌మిచ్చారు కేసీఆర్. కొంద‌రు రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ న‌వ్వుతూ…నీ ప్ర‌శ్న‌లోనే స‌మాధానం ఉంది క‌దా…మ‌ళ్లీ నేను చెప్పేదేముంది అన్నారు. మ‌రో రిపోర్ట‌రు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్ అంటూ ఊహాగానాలు వ‌స్తున్నాయి క‌దా…దీనిపై మీరేమంటారు…అని అడ‌గ్గా….కేసీఆర్ త‌న‌దైన స్టైల్లో స‌మాధాన‌మిచ్చారు. ఊహాగానాల‌ని మీరే అన్నారు క‌దా..త్వ‌ర‌లోనే నిజం తెలుస్తుంది..అంటూ చెప్పేశారు.

మీడియాకు కూల్ గా క్లాస్ కూడా పీకారు. శాస‌న‌స‌భ సమావేశాల‌ప్పుడు ఏవేవో రాస్తుంటార‌ని, ప్ర‌తిప‌క్షాలు అస్త్ర‌శ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాయ‌ని రాస్తార‌ని….నిజానికి వాళ్ల ద‌గ్గ‌ర అస్త్రాలు లేవు, శ‌స్త్రాలు లేవు…మీడియానే ఎక్కువ చేసి రాయ‌డ‌మెందుకంటూ ఎద్దేవా చేశారు. ఒకరిద్ద‌రు రిపోర్ట‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాంచి స‌మాధానాలివ్వ‌డంతో మిగ‌తా వాళ్లంతా అల‌ర్ట్ అయ్యారు. ఏదో సాదాసీదా ప్ర‌శ్న అడిగి మ‌మ అనిపించారు.