నేత‌ల వేట‌లో కేసీఆర్‌… కొత్త ఆప‌రేష‌న్ స్టార్ట్‌..!

September 11, 2017 at 1:46 pm
telangana, KCR, TRS

తెలంగాణ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు నేత‌ల వేట‌లో ప‌డ్డారు. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ రాష్ట్రంలో కారును ఓ రేంజ్‌లో దూసుకుపోయేలా చేయాల‌ని నిర్ణ‌యించుకున్న గులాబీ ద‌ళం అధినేత ఆదిశ‌గా ఇప్పుడు ఆప‌రేష‌న్ స్టార్ట్ చేశారు. వాస్త‌వానికి రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 90 మంది ఇప్ప‌టికే ఉన్నా.. వీరిలో కొంద‌రు బ‌ల‌హీనుల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌ట్టుకుని విజ‌యం సాధించ‌లేర‌ని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆయ‌న గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారు ఏ పార్టీలో ఉన్నా పిలిచి కండువా క‌ప్పేందుకు రెడీ అయిపోయార‌ని తెలుస్తోంది.

కేసీఆర్ సీఎం అయ్యాక చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ, బీఎస్పీ, సీపీఐ పార్టీల నుంచి భారీగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. వీరిలో కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు కూడా ద‌క్కాయి. అయినా వీరిలో కొంద‌రు ఎమ్మెల్యేలు బ‌ల‌హీనంగా ఉండ‌డంతో అక్క‌డ బ‌లంగా ఉన్న ఇత‌ర పార్టీల నేత‌ల‌కు వ‌ల వేసేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్ గీశారు. ఇందుకోసం ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు రెడీ అవుతున్నారు.

ఈ ఆప‌రేష‌న్ ఆకర్ష్‌లో భాగంగా విప‌క్ష నేత‌ల‌కు కేసీఆర్ గేలం వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. విప‌క్షంలో బ‌లంగా ఉన్న నేత‌లు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా గెలుస్తార‌ని భావిస్తున్న నేత‌ల‌కు ఆహ్వానం ప‌ల‌కాల‌ని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పై ఆశలు పెంచుకున్నారు. మెదక్ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ‌తో కూడా చర్చలు జరుపుతున్నట్టు స‌మాచారం. అయితే, మెదక్ జిల్లాలో తాను సూచించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని రాజనర్సింహ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక‌, వికారాబాద్ లో కాంగ్రెస్‌ మాజీ మంత్రి ప్రసాద్ కుమార్‌కు కూడా టీఆర్ ఎస్‌ నేతలు వలవేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ వంటి నేతలను ఆక‌ర్షించ‌డం ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావిస్తున్నారు. ఇక‌, కాంగ్రెస్ లో కీల‌కంగా ఉన్న జేజ‌మ్మ డీకే అరుణ‌, సంప‌త్‌కుమార్‌, భ‌ట్టి విక్ర‌మార్క‌ల‌కు కూడా వ‌ల విసురుతున్నారు టీఆర్ ఎస్ నేత‌లు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలాగూ గెలిచేది క‌ల్లేన‌ని, ఇప్ప‌టికైనా నిజాలు తెలుసుకుని టీఆర్ ఎస్‌లోకి వ‌స్తే.. మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని కూడా వాళ్ల‌కి క‌బురు వెళ్లింద‌ని స‌మాచారం. సో.. 2019 ల‌క్ష్యంగా కేసీఆర్ ఇలా పావులు క‌దుపుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

నేత‌ల వేట‌లో కేసీఆర్‌… కొత్త ఆప‌రేష‌న్ స్టార్ట్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts