ఫిరాయింపు ఎంపీకి కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్‌

అభివృద్ధిలోనే కాదు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డంలోనూ ఇరు రాష్ట్రాల సీఎంలు పోటీప‌డుతున్నారు. వారికి కూడా స‌మాన ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని తెలియ‌జేస్తున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా త‌మ పార్టీలోకి తీసుకుంటున్న ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. ఒక‌డుగు ముందే ఉన్నారు. ఆస‌ల్యంగా మొద‌లుపెట్టినా.. ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ఏకంగా న‌లుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వంతు వ‌చ్చింది. అందుకే ఫిరాయిం పు ఎంపీకి కేబినెట్ కీల‌కమైన‌ ప‌ద‌వి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో అన్నివ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం ఎన్నో వ‌రాలు ప్ర‌కటిస్తున్నారు. ఇక రైతు సమన్వయ సమితుల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒక్కొక్క గ్రామానికి 15మంది రైతులను ఎంపిక చేసి ఈ సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలి. శనివారం ఆఖరి రోజు కావ‌డంతో ఆరోజే దాదాపు అన్ని గ్రామాల సమితులను ఎమ్మెల్యేలు హడావిడిగా ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా నల్లగొండ ఎంపీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నియమించనున్నట్లు తెలుస్తోంది. గుత్తా పేరే ఖరారయినట్లు సమాచారం.

ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఎంతోకాలం నుంచి ఆయ‌న ప‌దవి కోసం వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు.. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు కారు ఎక్కే శారు! అంతేగాక వీరిలో కొంత‌మందికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టేశారు. వీరిలో మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే పార్టీలో చేరిన వారికి ప‌ద‌వులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించినా.. ఇంకా ఈ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌కపోవ‌డంతో కొంత‌మంది అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. ముఖ్యంగా గుత్తా కూడా కేసీఆర్ వైఖ‌రిపై కొంత అస‌హ నం ప్ర‌ద‌ర్శిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్నుకేబినెట్ ర్యాంకు ఉన్న ప‌ద‌వికి ఎంపిక చేశారు.

గ్రామస్థాయిలో యాక్టివ్ గా ఉండే సభ్యులను మండల సమితిలోనూ, మండల సమితిలో ఉన్న కీలకమైన వారిని జిల్లా కమిటీలో నియమిస్తారు. జిల్లా స్థాయి కమిటీలోనూ 24 మంది సభ్యులుంటారు. మొత్తం 31 జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తర్వాత రాష్ట్రస్ధాయి రైతు సమితిలో 42 మంది రైతులతో కమిటీని నియమిస్తారు. మండల స్థాయి సభ్యులకు త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.ఈ శిక్షణ కార్యక్రమానికి స్వయంగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. డిసెంబర్ లోపు ఈ ప్రకియ పూర్తయితే వచ్చే ఏడాది రైతుకు పెట్టుబడి రూపంలో ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వనుంది.