కేకేకి కేసీఆర్ పొగ‌!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. గ‌త శ‌తృవు ఇప్ప‌డు మిత్రుడు కావొచ్చు. ఇప్ప‌టి మిత్రుడుపై వెగ‌టు పుట్ట‌నూ వ‌చ్చు!! సాక్ష‌త్తూ.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదే జ‌రుగుతోంది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి కాంగ్రెస్‌కు న‌మ్మిన బంటుగా ఉన్న కే కేశ‌వ‌రావు(కేకే).. తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధినేత కేసీఆర్ ఆహ్వానంతో రాష్ట్ర ఆవిర్భావ స‌మ‌యంలోనే పార్టీ కండువా మార్చేశారు. ఆ త‌ర్వాత కేసీఆర్‌, కేకేల బంధం ఢిల్లీ వ‌రకు పాకింది. అయితే, రాజ‌కీయ‌ల్లో ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న మాట‌ను నిజం చేస్తూ.. కేకేకి కేసీఆర్ పొగ‌బెట్టార‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని మియాపూర్ భూ కుంభ‌కోణం కుదిపేస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసులో పెద్ద త‌లకాయ‌లు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. దీంతో ఈ కేసును చూస్తున్న రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీని ఈ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించిన సీఎం కేసీఆర్‌.. మియాపూర్ కేసు వివ‌రాల‌ను తానే చూస్తున్నారు.

అయితే, అనూహ్యంగా ఈ కేసులో కేకే పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది! వాస్త‌వానికి ఈ కేసును పూర్తిగా సీఎం కేసీఆరే చూస్తున్న నేప‌థ్యంలో పెద్దల పేర్లు బ‌య‌ట‌కు రావాలంటే.. ఆయ‌న అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి! అంతేకాదు, కేకే, కేసీఆర్‌ల మ‌ధ్య సంబంధం చూసినా.. కేకే పేరు బ‌య‌ట‌కు రావాలంటే.. కేసీఆర్ ఓకే చెప్పాలి. అలాంటి ప‌రిస్థితిలో.. కేకే పేరు బ‌య‌ట‌కు రావడాన్ని బ‌ట్టి.. కేసీఆర్ ఈ పేరు బ‌య‌ట పెట్టేందుకు అనుమ‌తి ఇచ్చార‌ని తెలుస్తోంది. అంటే.. వీరిద్ద‌రి మ‌ధ్య సంబంధాల‌కు విభేదాల‌నే బీట‌లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో స్పందించిన కేకే కూడా.. తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. తాను కోర్టు అనుమ‌తితోనే ఆ స్థ‌లాన్ని రిజిస్ట‌ర్ చేయించుకున్నాన‌ని, ఆ స‌మ‌యంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీని కూడా క‌లిశాన‌ని ఆయ‌న ఓకే చెప్పార‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఏదైనా చర్య‌లు తీసుకుంటే అది కోర్టు ధిక్కారం కింద‌కే వ‌స్తుంద‌ని బ‌హిరంగ కామెంట్లు చేశారు. దీనిని బ‌ట్టి కేసీఆర్‌కి కేకేకి చెడింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, తెలంగాణ‌లో ఇటీవ‌ల కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు చేయాల్సిన కేకే మౌనంగా ఉండిపోవ‌డం కేసీఆర్‌కి మండించి ఉంటుంద‌ని, దీంతో ఆయ‌న‌ను వ‌దిలించుకోవాల‌ని భావించి ఉంటార‌ని అంటున్నారు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.