బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ న‌ష్ట‌పోయిందా?

బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్ర‌స్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్ర‌ధాని వాజ‌పేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మ‌ధ్య బంధం ఉంది. ఈ క్ర‌మంలోనే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్ర‌బాబు గెలుపు బావుటా ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా కేంద్రంలోనూ బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికి.. మంత్రి ప‌దవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ స‌భ్యుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

ఇంత బ‌లంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీట‌లు వారుతోందా? బీజేపీతో పొత్తు విక‌టిస్తోందా? అంటే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. నిన్న చేసిన కామెంట్లు ఔన‌నే అనిపిస్తున్నాయి. ఏమైందో ఏమో ఉరుములు లేని వాన‌లా ఎంపీ నోట బీజేపీకి వ్య‌తిరేకంగా కామెంట్లు వ‌చ్చేశాయి. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ పొత్తు వ‌ల్ల తాను తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌న్న ఆయ‌న 2019లో ఆ పార్టీతో పొత్తు లేకుండానే లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధిస్తాన‌ని చెప్పారు.

ఒక‌ప‌క్క చంద్ర‌బాబు బీజేపీతో బంధాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. త‌మ్ముళ్లు మాత్రం ఇలా బ‌హిరంగంగా బీజేపీని ఏకేస్తున్నారు. మ‌రోప‌క్క‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. బీజేపీతో పొత్తుకు అక్క‌డి నేత‌లు త‌హ‌త‌హ లాడుతున్నారు. ఏదో ఒక విధంగా కేసీఆర్‌కు చెక్ పెట్ట‌డం ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకురావాల‌ని తెలంగాణ నేత‌లు భావిస్తున్నారు. దీనిపై ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబుకి తెలంగాణ టీడీపీ నేత‌లు వివ‌రించారు కూడా.

అయితే, చంద్ర‌బాబు మాత్రం.. ఈ విష‌యంలో ఎవ‌రూ తొంద‌ర ప‌డొద్ద‌ని అన్నారు. ఇక‌, బీజేపీ విష‌యానికి వ‌స్తే.. ఏపీలో అధికార టీడీపీపై ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన ప‌క్షంలో అవ‌స‌ర‌మైతే.. విప‌క్ష జ‌గ‌న్‌తో చ‌ట్టాప‌ట్టాలేసుకుని 2019 ఎన్నిక‌ల్లో పోటీకి దిగేందుకు క‌మ‌ల ద‌ళాధిప‌తి అన్నీ సిద్ధం చేసుకున్నారు. దీనిపై ఇటీవ‌ల జ‌గన్‌తో భేటీ అయ్యారు. అంటే అటు టీడీపీ, ఇటు బీజేపీలు రెండూ.. 2019పై అవ‌కాశ వాద రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.