మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై కొత్త ట్విస్ట్‌

స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ బీజేపీతో ఉంటుద‌ని కొంద‌రు, కాదు కాదు జ‌న‌సేన‌తో ఉంటుంద‌ని మ‌రి కొంద‌రు ప్రచారం చేశారు. కిర‌ణ్ జ‌న‌సేన‌లోకి వెళితే ప‌వ‌న్ త‌న త‌ర్వాత పార్టీలో రెండో ప్లేస్ క‌ట్టబెడ‌తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అలాగే బీజేపీలో చేరాల‌ని కూడా కిర‌ణ్ భావించినా వెంక‌య్య ఆయ‌న బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నార‌ని కూడా అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు కిర‌ణ్ పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై మ‌రో ట్విస్ట్ చోటు చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర విభ‌జ‌న‌ను అడ్డుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కిర‌ణ్ మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభ‌జించింది. కాంగ్రెస్ తీరుతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ఆయ‌న ఆ పార్టీని వీడి బ‌య‌ట‌కు వ‌చ్చి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీ పెట్టి గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్నారు. కిర‌ణ్ సొంత నియోజ‌క‌వ‌ర్గం పీలేరులో కిర‌ణ్ సోద‌రుడు న‌రేష్‌కుమార్ రెడ్డి కూడా ఘోరంగా ఓడిపోయారు.

ఇక ఈ మూడున్న‌రేళ్లుగా రాజ‌కీయాల‌కు దూరంగా సైలెంట్‌గా ఉన్న కిర‌ణ్ ఇప్పుడు త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ముందుగా బీజేపీలోకి వెళ్లాల‌ని అనుకున్నారు. గ‌తంలో వెంక‌య్య ఆయ‌న బీజేపీ ఎంట్రీని అడ్డుకున్నా ఇప్పుడు ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా వెళ్లిపోవ‌డంతో ఆయ‌న‌కు ఇబ్బంది లేదు. అయినా కిర‌ణ్ మ‌న‌స్సు మాత్రం కాషాయంలోకి వెళ్లేందుకు అంగీక‌రించ‌డం లేద‌ట‌.

కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన కావూరు సాంబ‌శివ‌రావు, ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ లాంటి వాళ్లు ఇప్పుడు బీజేపీలో చెల్లని నాణేలు అయ్యారు. వీళ్ల పరిస్థితికి భిన్నంగా కిరణ్‌కుమార్‌ రెడ్డిని కూడా బీజేపీ భుజానికెత్తుకుంటుందనే నమ్మకం లేదు. బీజేపీలో అంతా సంఘ్ మూలాలు ఉన్న శ‌క్తులదే కీల‌క‌పాత్ర‌. ఈ క్ర‌మంలోనే కిర‌ణ్ తిరిగి ఇప్పుడు త‌న సొంత గూడు అయిన కాంగ్రెస్‌లో చేరేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కిర‌ణ్‌కు కాంగ్రెస్ అధిష్టానం వ‌చ్చే యేడాది ఎన్నిక‌లు జ‌రిగే కర్ణాట‌కకు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.