గుడివాడ‌లో పండ‌గ చేస్కొంటోన్న కొడాలి నాని… అస‌లు క‌థ ఇదే

అధికార పార్టీ నేత‌లు తన్నుకుంటుంటే.. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పండ‌గ చేసుకుంట‌న్నారు. పాలిటిక్స్‌లో మ‌నం బ‌ల‌ప‌డాలంటే.. ఒక్క మ‌న బ‌ల‌మే అక్క‌ర్లేదు.. ఎదుటి వాడి వీక్ నెస్ కూడా మ‌న‌కు బ‌లమే! ఇప్పుడు నాని.. ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో ఈయ‌న‌పై స్థానికంగా వ్య‌తిరేకత వ‌చ్చింది. పార్టీ కార్యాల‌యం కోసం అద్దె కు తీసుకున్న ఇంటిని ఖాళీ చేయ‌క‌పోగా య‌జ‌మానిపై దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డ విష‌యం ర‌చ్చ ర‌చ్చ చేసింది. దీనివ‌ల్ల ఇమేజ్ పూర్తిగా దెబ్బ‌తింది.

కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మునిసిప‌ల్ వార్డు ఉప ఎన్నిక‌ల్లో సిట్టింగ్ సీటును కూడా ఆయ‌న గెలిపించుకోలేక‌పోయారు. వ‌రుస‌గా గెలుస్తుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మైంది. ఎలాగూ త‌న‌ను మించిన నేత గుడివాడ‌లో లేడ‌నుకున్న నాని.. జ‌నాలు చ‌చ్చిన‌ట్టు త‌న‌నే ఎన్నుకుంటార‌నే ధీమాలో ఉన్నారు. ఈ క్ర‌మంలో స్థానికంగా ఎదిగేందుకు తెలుగుదేశం కృషి చేయాల్సి ఉంది. నాని ఆగ‌డాల‌ను వీరు అడ్డుకుని, త‌మ‌కు అనుకూలంగా ప‌రిస్థితిని మ‌లుచుకుందామ‌ని స్థానిక టీడీపీ నేత‌లు భావించ‌క‌పోగా త‌మ‌లో తాము చోటా ప‌ద‌వుల కోసం కొట్టుకుంటున్నారు.

గుడివాడ మార్కెట్ యార్డు విష‌యంలో త‌లెత్తిన ర‌గ‌డ ప్ర‌స్తుతం హైకోర్టుకు చేరింది. విష‌యంలోకి వెళ్తే.. గుడివాడ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ గా పార్టీ అధిష్టానం ఆరికపూడి వెంకటరామ శాస్త్రిని నియమించింది. అయితే ఈ నియామకం పట్ల అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత పెదబాబు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. శాస్త్రి లోకల్ కాదంటున్నారు. నాన్ లోకల్ కు పదవి ఇవ్వడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాని పెదబాబు మాటలను అధిష్టానం లైట్ తీసుకుంది. దీంతో ఆయన ఈ నియామకంపై హైకోర్టును ఆశ్రయించారు.

పెదబాబు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టుకు వెళ్లడంతో పెదబాబు దగ్గరకు పార్టీ నేతలు పరుగులు పెడుతున్నారు. అయినా పెదబాబు వర్గం మాత్రం పట్టించుకోవడం లేదు. తాము మూడు దశాబ్దాల నుంచి పార్టీకి పని చేస్తుంటే ఎవరో ఒకరికి పదవిని కట్టబెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ప‌రిణామంతో స్థానిక నేత‌లు చీలిపోతున్నార‌నే టాక్ కూడా వినిపించింది. దీనిని గ‌మ‌నిస్తున్న నాని.. భ‌లే హ్యాపీగా ఫీల‌వుతున్నారు. 2019లో కూడా త‌న‌కు తిరుగులేద‌ని పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. ఇదీ గుడివాడ సంగ‌తి