తెలంగాణ‌లో కేసీఆర్ వ్య‌తిరేక ఉద్య‌మం రెడీనా?

తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కారుపై ముప్పేట దాడి పెరుగుతోంది. విప‌క్షాల మాటేమోగానీ, కేసీఆర్‌కు స‌న్నిహితుడు, ఉద్య‌మ స‌మ‌యంలో అన్నీతానై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి.. తెలంగాణ సాధ‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఇప్ప‌డు కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెం మాదిరిగా త‌యార‌య్యాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చి పరిపాల‌నా కొనసాగిస్తున్నా ఇప్పటికీ సామాన్యుల సమస్యలు అలాగే ఉన్నాయ‌ని, బంగారు తెలంగాణ సాధ్యం కాలేద‌ని కొదండ‌రాం ఆరోపిస్తున్నారు.

అంతేకాదు, ఇంత కష్టబడి ప్రత్యెక తెలంగాణ సాధించుకుంటే పెత్తందారి వ్యవస్థలో పుట్టుకొచ్చిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని కబ్జా చేసిందని దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విరక్తితో వున్నారని, కీసీఆర్ ఫ్యామిలీ ప్రజలని దోచుకుతింటూ మరల కనుమరుగైన పెత్తందారి వ్యవస్థకి ఊపిరి పోస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

అదేస‌మ‌యంలో వ్య‌క్తిగ‌తంగానూ కేసీఆర్‌పై ఫైర‌య్యారు కోదండం మాస్టారు. కేసీఆర్‌కి ఈగో ఎక్కువ‌ని ఎవ‌రినీ పైకి రానిచ్చేవాడు కాద‌ని అన్నారు.

ఇక‌, అధికారంలో చేతిలోకి వ‌చ్చాక‌.. ఏ ఒక్క‌రినీ లెక్క‌చేయ‌డం లేద‌ని అన్నారు. ప‌రిపాల‌న ఈ విధంగానే కొనసాగితే తెలంగాణలో మరో రజాకర్ల ఉద్యమం తప్పదని, పెత్తందారి వ్యవస్థ మీద ప్రజలు దాడికి దిగే ప‌రిస్థితి వస్తుందని కోదండరాం హెచ్చరించారు. మ‌రోప‌క్క‌, కోదండ రాం విప‌క్షాల‌తో క‌లిసిపోయి తెలంగాణ‌కు ద్రోహిలా మారాడ‌ని అధికార పక్షం దుయ్య‌బ‌ట్టింది. మ‌రి రాబోయే 2019 ఎన్నిక‌ల వేళ‌కి ఈ యుద్ధం ఎటువైపు తిరుగుతుందో చూడాలి.