దీనికి కూడా సీఐడీని  వాడేసుకుంటారా?!

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. అధికార సంస్థ‌ల‌ను ఎంత‌గా నిర్వీర్యం చేస్తోందో చెప్ప‌డానికి తాజా అసెంబ్లీ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ముఖ్యంగా క్ష‌ణం కూడా తీరిక‌లేని సీఐడీ వంటి సంస్థ‌ల‌ను అర్థం ప‌ర్థం లేని విష‌యాల‌పై విచార‌ణ‌కు నియ‌మిస్తుండ‌డం ప్ర‌స్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార ప‌క్షం ఈగోకు పోతుండ‌డం వ‌ల్ల విలువైన ప్ర‌జాధ‌నం కూడా దుర్వినియోగం అవుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షానికి అసెంబ్లీలో విప‌క్ష‌నేత‌కు కేటాయించిన చాంబ‌ర్ లోకి నీళ్లు వ‌చ్చాయి.

ఇది ఒకింత విస్మ‌యం క‌లిగించే విష‌యం. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని చెబుతున్న చంద్రాబాబు వంటి వారికి ఈ ఘ‌ట‌న గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డిన‌ట్టుగానే అనిపిస్తోంది. అసెంబ్లీనే స‌రిగా నిర్మించ‌లేని ప‌రిస్థితిలో ఉన్న వారు ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రాన్ని ఎలా నిర్మిస్తార‌ని అంద‌రూ అనుకోవ‌డం స‌హ‌జం. ఇక‌, ఏ అవ‌కాశం దొరుకుతుండా బాబు నెత్తిన ఎక్కేద్దామ‌ని చూసే వైసీపీ నేత‌ల‌కు ఈ నీళ్ల ఘ‌ట‌న కోతికి కొబ్బ‌రికాయ దొరికిన‌ట్టు అయింది.

ఈ ఘ‌ట‌న‌ను చిల‌వ‌లు ప‌ల‌వ‌లు చేస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ఈ సంద‌ర్భంగా అటు అధికార ప‌క్షం, ఇటు ప్ర‌తిప‌క్షం నేత‌ల‌కు స‌ర్ది చెప్పాల్సిన మాన్య‌శ్రీ స్పీక‌ర్ వ‌ర్యులు కూడా య‌ధాలాపంగా విచార‌ణ‌లు, ప‌రిశీల‌న‌లు అంటూ విష‌యాన్ని పెద్ద‌ది చేశారు. దీనిపై సీఐడీ వంటి సంస్థ‌తో విచార‌ణ చేయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిజానికి భారీ వ‌ర్షం కురిసి.. కొద్దిపాటి నీరు విప‌క్ష నేత చాంబ‌ర్‌లో కి వెళ్లింది. ఇది పొర‌పాటే. దీనికి నిర్మాణంలో లోపం త‌లెత్తి ఉంటుంది. దీనిని సామ‌ర‌స్య పూర్వ‌కంగా ప‌రిష్క‌రించాల్సిన నేత‌లు పెద్ద‌ది చేయ‌డం, సీఐడీ వంటి పెద్ద సంస్థ‌ను ఇలా చీప్ పాలిటిక్స్‌కి వినియోగించుకోవ‌డం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది.

రాష్ట్రంలో అనేక ప్ర‌ధాన స‌మ‌స్య‌లు ఉన్నాయి. కాల్ మనీ ఏమైంది? ముద‌్ర‌గ‌డ ర‌త్నాచ‌ల్‌ కేసేమైంది? పుష్క‌రాల్లో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై విచార‌ణేమైంది? ఇవి కొన్ని మాత్ర‌మే. ఇంకా చాలా ఉన్నాయి వాట‌న్నింటినీ వ‌దిలేసి.. ఏప‌నీ లేన‌ట్టుగా ప్ర‌భుత్వం త‌గుదున‌మ్మా అంటూ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై అంద‌రూ న‌వ్విపోతున్నారు. అయిన‌నూ ప్ర‌భుత్వ వైఖ‌రిలో మార్పు లేక‌పోవ‌డం ఇప్ప‌డు అంద‌రినీ క‌ల‌చి వేస్తున్న ప‌రిణామం.