పాల్వాయి సొంత సీటుపై కోమటిరెడ్డి బ్రదర్స్ కన్ను

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు పాల్వాయి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తెలంగాణ‌లోని న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్‌కు యాంటీగా ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి స‌పోర్ట్‌గా ఉంటూ వ‌స్తోన్న పాల్వాయి మృతి రాజ‌కీయంగా ఉత్త‌మ్‌కు పెద్ద దెబ్బే. అదే టైంలో ఆయ‌న మృతి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు కాస్త రిలీఫ్ లాంటిదే. ఇదిలా ఉంటే పాల్వాయి మృతితో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన మునుగోడులో కాంగ్రెస్‌కు నాయ‌క‌త్వ కొర‌త ఏర్ప‌డింది.

మునుగోడు అంటే పాల్వాయికి కోట లాంటిది. ఆయ‌న గ‌తంలో ఇక్క‌డ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో గెలిచిన ఆయ‌న‌కు 2004లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు నేప‌థ్యంలో టిక్కెట్టు రాలేదు. 2009లో ఆయ‌న ఇక్క‌డ నుంచి సీపీఐ చేతిలో ఓడిపోయాడు. గ‌త ఎన్నిక‌ల్లో పాల్వాయి పోటీకి దూరంగా ఉండి త‌న కుమార్తె పాల్వాయి స్ర‌వంతికి సీటు ఇప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే సీపీఐతో పొత్తు నేప‌థ్యంలో ఆమెకు టిక్కెట్టు రాలేదు. కాంగ్రెస్ రెబ‌ల్‌గా పోటీ చేసిన ఆమె 27 వేల ఓట్లు తెచ్చుకున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మునుగోడు కాంగ్రెస్ వ్య‌వ‌హారాల‌న్ని పాల్వాయే చూసుకునే వారు. ఇప్పుడు ఆయ‌న మృతితో ఆయ‌న కుమార్తెకు నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్‌ను శాసించే గ్రిప్ అయితే లేదు. ఇక కాంగ్రెస్‌కు ముందు నుంచి బ‌లంగా ఉన్న మునుగోడు సీటుపై ఇప్పుడు కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ క‌న్నుప‌డినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఇప్ప‌టికే ఎమ్మెల్సీ రాజ్‌గోపాల్‌రెడ్డితో మంత‌నాలు జ‌రుపుతున్నారు.

కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక రాజ్‌గోపాల్‌రెడ్డి ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మునుగోడు నుంచి బ‌రిలో ఉండ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రాజ్‌గోపాల్‌రెడ్డి త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌స్తే ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లోపేతం అవ్వ‌డంతో పాటు గెల‌వ‌వ‌చ్చ‌న్న అంచ‌నాతోనే నియోజ‌క‌వ‌ర్గ కాంగ్రెస్ నాయ‌కులు ఆయ‌న్ను ఇక్క‌డ‌కు ఆహ్వానిస్తున్న‌ట్టు స‌మాచారం.