చంద్ర‌బాబు ఈ త‌ప్పు మ‌ళ్లీ చేస్తారా… ఇక్క‌డితో ఆగుతారా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు కొన్ని విష‌యాల్లో ప‌దే ప‌దే త‌ప్పులు కంటిన్యూ చేస్తుంటారు. కొన్ని విష‌యాల్లో ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌ని రీతిలో అద్భ‌త నిర్ణ‌యాలు తీసుకునే చంద్ర‌బాబు కొన్ని సార్లు తీసుకునే నిర్ణ‌యాలు చాలా ఘోరంగా ఉంటాయి. బాబు ఏ ఈక్వేష‌న్ల‌తో ఇలా చేస్తారో ? తెలియ‌దు కాని…కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీని నిర్వీర్యం చేసే వాళ్ల‌ను ఆయ‌న ప‌దే ప‌దే ఎంక‌రేజ్ చేస్తుంటారు.

కృష్ణా జిల్లా తిరువూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గ‌త మూడు ఎన్నిక‌ల్లోను ఓడిపోయింది. విశేషం ఏంటంటే ఈ మూడు ఎన్నిక‌ల్లోను మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌గ‌ట్ల స్వామిదాసు ఓడిపోయారు. 2009, 2014 ఎన్నిక‌ల్లోను స్వామిదాసు చేజేతులా ఓడిపోయారు. 2009 ఎన్నిక‌ల్లో పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌ను అడ‌గ‌డంలో కూడా దారుణ‌మైన నిర్ల‌క్ష్యం వ్య‌వ‌హ‌రించ‌డంతో 265 ఓట్ల‌తో ఓడిపోయాడు. ఇక గ‌త ఎన్నిక‌ల్లోను స్థానిక క్యాడ‌ర్‌ను క‌లుపుకు వెళ్ల‌డంతో ఫెయిల్ అవ్వ‌డంతో 1600 ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయాడు.

విచిత్రం ఏంటంటే స్వామిదాసు ఈ మూడు ఎన్నిక‌ల్లోను ముగ్గురు వేర్వేరు వ్య‌క్తుల చేతుల్లో ఓడిపోయారు. 2004లో కోనేరు రంగారావు, 2009లో దిరిశం ప‌ద్మ‌జ్యోతి, 2014లో కొక్కిలిగడ్డ ర‌క్ష‌ణ‌నిధి చేతుల్లో స్వామిదాసు ఓడిపోయారు. క్యాడ‌ర్‌ను క‌లుపుకు వెళ్ల‌క‌పోవ‌డం, నిర్ల‌క్ష్యం, పార్టీ సీనియ‌ర్ల ప‌ట్ల స‌ఖ్య‌త‌తో లేక‌పోవ‌డంతో స్వామిదాసు వ‌రుస‌గా ఓడిపోతున్నారు. వ‌రుస‌గా ఓడిపోతున్నా చంద్ర‌బాబు మాత్రం స్వామిదాసుకే టిక్కెట్ ఇచ్చి ప‌దే ప‌దే త‌ప్పులు చేస్తున్నారు.

ఇక తిరువూరు టీడీపీలో ప్ర‌స్తుతం వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం మ‌రోసారి స్వామిదాసుకు టిక్కెట్ ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లోను నియోజ‌క‌వ‌ర్గ జ‌నాలు ఆయ‌న‌కు ఓట్లేసే ప‌రిస్థితి లేదంటున్నారు. చంద్ర‌బాబు ఈ సారి అయినా స‌రైన డెసిష‌న్ తీసుకుంటే త‌ప్ప తిరువూరులో టీడీపీ జెండా ఎగిరే ప‌రిస్థితి లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరువూరులో స్వామిదాసును ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయి.

పామ‌ర్రు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వ‌ర్ల రామ‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరువూరు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న టీడీపీలోకి రావ‌డంతో రామ‌య్య క‌న్ను తిరువూరుపై ప‌డింది. ఇక ఈ నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికుడు అయిన ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హ‌ర్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వామిదాసును మార్చ‌క‌పోతే మ‌రోసారి తిరువూరు సీటు టీడీపీ గెలుస్తుందా ? అంటే చాలా సందేహాలే వినిపిస్తున్నాయి.