2019లో తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా దాదాపు ఖ‌రారైన‌ట్టేనా ? అంటే ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ట్రెండ్ చూస్తుంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. కేసీఆర్ త‌ర్వాత ఆయ‌న నెక్ట్స్ వార‌సుడు ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌కు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ రేసులో గ‌త కొద్ది యేళ్లుగా కేసీఆర్ మేన‌ళ్లుడు హ‌రీష్‌రావుతో పాటు కుమారుడు కేటీఆర్ ఇద్ద‌రూ ఉంటూ వ‌చ్చారు.

ఎప్పుడైతే 2014లో విజ‌యం త‌ర్వాత కేసీఆర్ సీఎం అయ్యారో అప్ప‌టి నుంచి హ‌రీష్‌రావు ప్రాధాన్య‌త త‌గ్గుతూ వ‌స్తోంది. హ‌రీష్‌రావు క్ర‌మ‌క్ర‌మంగా వెన‌క్కివెళ్లిపోతున్నాడు. ఇక కొద్ది రోజులుగా కేటీఆర్ త‌న దూకుడు మ‌రింత పెంచేస్తున్నాడు. ఇటీవ‌ల వ‌రుస‌గా భారీ బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొంటున్నాడు. విప‌క్షాల‌పై దూకుడు పెంచుతూ ఇటూ పార్టీలోను, అటు ప్ర‌భుత్వంలోను అన్ని జిల్లాల్లోను త‌న వ‌ర్గాన్ని ఏర్ప‌రుచుకున్నాడు.

2019 ఎన్నిక‌ల ర‌థ‌సార‌థిగా కేటీఆర్ దూసుకుపోతున్నారు. ఆయ‌న ఇప్పటికే పెద్దపల్లి, తాండూరు, కొల్లాపూర్‌ సభల్లో పాల్గొనగా.. గురువారం ఆర్మూరు సభలో పాల్గొన్నారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఆర్మూర్ స‌భ‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు డీఎస్, కవిత తదితరులు కూడా కేసీఆర్‌ రాజకీయ వారసుడు కేటీఆరేనన్న రీతిలో ప్రసంగించారు. చివ‌ర‌కు కేటీఆర్ కూడా మీ అంద‌రి ఆశీర్వాదాలు త‌న‌కు కావాల‌న్నారు.

ఈ సంకేతాల‌న్ని చూస్తుంటే 2019 ఎన్నిక‌ల త‌ర్వాత టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆరే ఉంటాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక మ‌రోవైపు హ‌రీష్‌రావు ప్రాధాన్య‌త రోజు రోజుకు త‌గ్గుతూ వ‌స్తోంది. ఆయ‌న దూకుడు త‌గ్గిపోయింది. హ‌రీష్ ప్ర‌స్తుతం మెద‌క్, సిద్ధిపేట జిల్లాల‌కు ప‌రిమిత‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. రోజురోజుకు హ‌రీష్ వ‌ర్గం ప్రాధాన్య‌త త‌గ్గిపోతుంటే కేటీఆర్ వ‌ర్గం ప్రాధాన్య‌త పెరుగుతోంది.