జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక వైసీపీలో కీల‌కంగా మార‌బోతున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేగాక కేవీపీ స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను జ‌గ‌న్ తూచ త‌ప్ప‌కుండా పాటిస్తుండ‌టంతో నేత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో కేవీపీ ఎంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు! ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు కూడా ఆయ‌న స‌న్నిహితంగా ఉండేవారు. జగన్ కూడా వైఎస్ మాట వినకపోయినా.. కేవీపీ మాటకు విలువిచ్చేవారనే ప్రచారం అప్పట్లో జరిగింది. వైఎస్‌ మ‌ర‌ణం త‌ర్వాత‌.. జరిగిన ప‌రిమాణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌, కేవీపీ మ‌ధ్య దూరం పెరిగింది. సోనియాను విభేదించాలన్న జగన్ నిర్ణయంతో మాత్రం కేవీపీ ఏకీభవించలేదు. అందుకే అప్పట్లో కేవీపీపై జగన్ విమర్శలు చేసినా.. ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. అయితే ఆయ‌న మ‌ళ్లీ.. జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే ప్ర‌చారం వైసీపీలో జోరందుకుంది.

ప్రస్తుతం జగన్ కు కేవీపీ రాజకీయ అండదండలు అందిస్తున్నారని చెబుతున్నారు. నంద్యాల ఉపఎన్నికల వ్యూహరచన బాధ్య‌త‌ను కూడా ఆయనే చేస్తున్నారని వివ‌రిస్తున్నారు. సీనియర్ల మాట లెక్కచేయని జగన్.. ఈ మధ్య కేవీపీ చెప్పిన పనులు చేస్తున్నారని, అందుకు శిల్పా చేరికే ఉదాహరణ అని చెబుతున్నారు. అదే నిజమైతే చంద్రబాబు బ్రెయిన్ కు దీటైన బ్రెయిన్ దొరికినట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా జగన్ కేవీపీ చెప్పినట్లు వింటారా అనే విషయం పక్కనపెడితే శిల్పా ఎపిసోడ్ లో మాత్రం టీడీపీకి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయట. అందుకే ఎందుకైనా మంచిదని చంద్రబాబు నంద్యాలలో స్వయంగా రంగంలోకి దిగారనే మాట వినిపిస్తోంది.

మంచి ఫేస్ వాల్యూ లేని నేత లేకుండా కేవీపీ రాణించలేరని, ఇప్పుడు జగన్ కు గతంలో వైఎస్ అంత స్థాయి లేదని టీడీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారు. మ‌రి నంద్యాల‌లో ఇద్ద‌రు సీనియ‌ర్ల మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు జ‌రుగుతుంద‌నేది ఖాయ‌మ‌ని తెలుస్తోంది.