జగన్ తో పెద్దాయన డీల్ షురూ!  ఇక కండువా మారుడే!

వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జ‌గ‌న్ చెంత‌కు చేర‌నున్నారా? త‌్వ‌ర‌లోనే కాంగ్రెస్‌కు రాం రాం ప‌ల‌క‌నున్నారా? ఏపీలో జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే ధ్యేయంగా ఆయ‌న వైసీపీ ని ముందుండి న‌డిపిస్తారా? ఇప్ప‌టికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది లోట‌స్ పాండ్ వ‌ర్గాల నుంచి. విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాడు జ‌గ‌న్‌.

ఈ క్ర‌మంలో ఆయ‌న బిహార్ నుంచి ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా ప్ర‌శాంత్ కిశోర్‌ని దిగుమ‌తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే న‌వ‌ర‌త్నాలు, మిస్డ్ కాల్‌, వైఎస్సార్ కుటుంబం వంటి కీల‌క ప‌థ‌కాల‌తో ఊద‌ర కొడుతున్నారు. ఇంత‌లోనే కాకినాడ‌, నంద్యాల ఎన్నిక‌లు రావ‌డం, ఈ రెండింటినీ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవడం తెలిసిందే. అయితే, అనూహ్యంగా జ‌గ‌న్ ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ పూర్తిగా చ‌తికిల ప‌డ్డాడు. పార్టీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో శ్రేణులు పూర్తిగా డీలాపడ్డారు.

దీంతో రాజకీయంగా పెద్ద దిక్కు లేకుండా ముందుకు వెళ్లడం సరికాదని జ‌గ‌న్ స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు భావించార‌ని తెలిసింది. పీకేను తెచ్చుకున్నా ఫ‌లితం లేద‌ని గుర్తించార‌ట‌. దీంతో త‌మ కుటుంబానికి స‌న్నిహితంగా ఉంటూ.. పార్టీని ప‌ట్టాలెక్కించే స‌ల‌హాలివ్వ‌గ‌ల పెద్ద త‌ల‌కాయ అయితే బాగుంటుంద‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే వారికి వైఎస్ ఆత్మ కేవీపీ క‌నిపించార‌ట‌. దీంతో హుటాహుటిన ఆయ‌న‌కు క‌బురు పెట్టి వై.ఎస్ వర్ధంతి నాడు ఇడుపులపాయలో జరిగే కార్యక్రమానికి పిలిచారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో కుటుంబం అంతా ప‌ర్స‌న‌ల్‌గా భేటీ అయింది. పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించింది. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ఎదుర్కొనేందుకు మ‌రింత‌గా పుంజుకోవాల‌ని కేవీపీ సూచించార‌ని స‌మాచారం. ఎలాంటి సూచ‌న‌లైనా పాటిస్తాన‌ని, ముందు మీరు పార్టీలోకి రండి అని జ‌గ‌న్ చేయి ప‌ట్టుకుని కేవీపీని అడిగార‌ని తెలిసింది. దీంతో ఆయ‌న పైకి ఏమీ చెప్ప‌క‌పోయినా మౌనంగా ఉన్నార‌ట‌.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ కేవీపీకి అన్ని విధాలా హామీలు ఇచ్చాడ‌ట‌. మ‌ళ్లీ రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని, పార్టీ అధికారంలోకి వ‌స్తే ఏపీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కూడా చెప్పాడ‌ట‌. దీంతో కేవీపీ మ‌నసు మార్చుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ తర్వాత విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో అంత చురుగ్గా పాల్గొన‌లేదు. ఈ ప‌రిణామాన్ని గమనించిన వైసీపీ ముఖ్య నేత కేవీపీ తమ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. కాగా, జ‌గ‌న్‌ ప్రయత్నాలు ఫలించి కేవీపీ వైసీపీ లోకి వెళితే ఆంధ్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయా? వేచి చూడాలి.