దివాళా దిశ‌గా ల‌గ‌డ‌పాటి ల్యాంకో..!

ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌, కాంట్ర‌వ‌ర్సి పొలిటిషీయ‌న్ అయిన విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీ ఖేల్ ఖ‌తం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. రాజ్‌గోపాల్‌కు చెందిన ప్ర‌ముఖ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ దివాలా ముంగిట నిలిచింది. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని తీర్చ‌లేక ఎగ‌వేత‌దారుల లిస్టులో ఉన్న కంపెనీల‌పై దివాలా ప్ర‌క్రియ ప్రారంభించాలంటూ ఇటీవ‌ల ఆ కంపెనీల‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల‌కు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

విజ‌య‌వాడ ఎంపీగా ప‌దేళ్ల‌పాటు ఉన్న రాజ్‌గోపాల్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకుని పెద్ద పెద్ద ట‌వ‌ర్లు నిర్మించారు. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో హైద‌రాబాద్‌లో ఆయ‌న పెట్టుబ‌డులు రుణాత్మ‌క వృద్ధి రేటు న‌మోదు చేశాయి. ఇక కోట్లాది రూపాయ‌ల‌తో ప్రారంభించిన ట‌వ‌ర్ల నిర్మాణాలు మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి.

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ మొత్తం రూ. 11,367 కోట్ల బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఫండ్‌ ఆధారిత బకాయీలకు సంబంధించి రూ.8,146 కోట్లు, నాన్‌ ఫండ్‌ బకాయీలు రూ. 3,221 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాజ్‌గోపాల్ తొలిసారి ఎంపీగా గెలిచిన‌ప్ప‌టి నుంచి యూపీఏ ప్ర‌భుత్వం నుంచి భారీగా ల‌బ్ధి పొందారు. ఆ త‌ర్వాత ఆయ‌న చాలా ప‌వ‌ర్ ప్రాజెక్టులు నెల‌కొల్పారు. ఇప్పుడు తీవ్ర న‌ష్టాల ఊబిలో కూరుకుపోవ‌డంతో ఆయ‌న వాటి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆయ‌న త‌న ప‌వ‌ర్ ప్రాజెక్టుల‌ను ఒక్కొక్క‌టిగా అమ్ముకుంటూ వ‌స్తున్నా బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఇప్ప‌టికే ల్యాంకోలో మూడో వంతుమంది ఉద్యోగుల‌ను తొల‌గించేశారు. ఇక అప్పులు తీర‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు దివాళా బాట ప‌ట్టింది. ల్యాంకు లెక్క‌కు మిక్కిలిగా అప్పులు చేయ‌డంతో పాటు ప‌వ‌ర్ రంగంలో ఇత‌ర కంపెనీల పోటీ త‌ట్టుకోలేక‌పోవ‌డం, హైద‌రాబాద్‌లో కోట్లాది రూపాయ‌ల నిర్మాణాలు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డంతో కోలుకోలేని దెబ్బతింది.