మోదీ నిర్ణ‌యానికి చంద్ర‌బాబు సై.. లోకేష్‌ నై

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, పంచాయ‌తీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌.. రోజుకో సంచ‌ల‌న వ్యాఖ్య‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు స‌మావేశాల్లో త‌డ‌బ‌డుతూ వ్యాఖ్య‌లు చేసి తండ్రికి త‌ల‌నొప్పులు తీసుకొచ్చిన ఆయ‌న‌.. మ‌రోసారి చంద్ర‌బాబుకు పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు. దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, అదే స‌మ‌యంలో ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలిక‌గా కొట్టిపారేశారు. అస‌లు ఏక‌కాలంలో అన్నిరాష్ట్రాల‌కూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగే ప‌నికాద‌ని కొట్టిపారేశారు!!

మంత్రి నారా లోకేష్.. వ్యాఖ్య‌లు మ‌రోసారి పార్టీలో క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. `దేశమంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఆమోదం తెలిపారు. దీనికి మేము కూడా సిద్ధ‌మే`.. ఇదీ ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతిఆయోగ్ స‌మావేశం త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు మాట‌! `2019కంటే ముందుగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌చ్చు. 2018 చివ‌రిలో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టినుంచే శ్రేణులు సిద్ధంగా ఉండాలి`.. పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మ‌ళ్లీ చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. అయితే ఇప్పుడు తండ్రి వ్యాఖ్య‌ల‌ను కొడుకు అడ్డంగా కొట్టిపారేశారు. ఏకంగా ప్రధాని మోదీ ప్రతిపాదననే తేలిగ్గా తీసిపారేశారు.

దేశంలో ఏక‌కాలంలో ఎన్నిక‌లు సాధ్యం కావ‌ని లోకేష్ స్ప‌ష్టంచేశారు. ఏడాది ముందు ఎన్నిక‌లంటే ఏ రాష్ట్రం ఒప్పుకోద‌ని, ఆరు నెల‌ల ముందు అయితే ఒప్పుకునే అవ‌కాశ‌ముంద‌ని వివ‌రించారు. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా లేద‌ని వెల్ల‌డించారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే అన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేసిన అధికార టీడీపీ కాక ఎవరు గెలుస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు.

మోదీ మాట‌ల‌కు ఎదురుచెప్ప‌ని చంద్ర‌బాబు!! మోదీ మాట‌ను ఖాత‌రు చేయ‌ని చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌! తండ్రీ కొడుకులిద్ద‌రూ ఎవ‌రి పంథాన వారు వ్యాఖ్యలు చేసుకుంటూ వెళితే.. టీడీపీ శ్రేణులు గంద‌ర‌గోళానికి గుర‌వ‌డం మాత్రం ఖాయ‌మ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.