బాబుకు షాక్‌: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత రాజకీయ తూకంలో ముల్లు మొగ్గంతా టీడీపీ వైపే ఉంది. వైసీపీకి చెందిన ఓ 15 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేస్తున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ లిస్టులో చాలా మంది పేర్లు కూడా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ స్టోరీ ఇలా ఉంటే ఇప్పుడు టీడీపీకి ఓ రివ‌ర్స్ గేర్ వార్త షాక్ ఇస్తోంది.

వైసీపీ కంచుకోట లాంటి జిల్లాలో టీడీపీ ఇప్పుడిప్పుడే స్ట్రాంగ్ అవుతోన్న వేళ అదే జిల్లాకు చెందిన ఓ సీనియ‌ర్ రాజకీయ‌వేత్త‌, టీడీపీ ఎమ్మెల్సీ వైసీపీలోకి వెళుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రకాశం జిల్లాలో గ‌త 15 ఏళ్ల‌లో టీడీపీ ఎప్పుడూ పైచేయి సాధించ‌లేదు. 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దెబ్బ‌కు కుదేలైన టీడీపీ, గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చేతిలో కూడా వెన‌క‌ప‌డిపోయింది.

గ‌త ఎన్నిక‌ల్లో జిల్లా ప‌రిష‌త్ స్థానంతో పాటు మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు, ఒంగోలు ఎంపీ సీటు కూడా వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. త‌ర్వాత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌తో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి రావ‌డంతో ఇప్పుడిప్పుడే జిల్లాలో రాజ‌కీయంగా పూర్తి ప‌ట్టుకోసం వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈ ప్ర‌య‌త్నాలు ఇలా ఉండ‌గానే టీడీపీకి షాక్ వార్త ఒక‌టి ట్రెండ్ అవుతోంది. జిల్లాలో బ‌ల‌మైన రాజ‌కీయ కుటుంబం అయిన మాగుంట ఫ్యామిలీకి చెందిన మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎంపీగా ఓడిపోయినా చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి గౌర‌వించారు. అయితే మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

చంద్ర‌బాబు పిలిచి మంత్రి ప‌ద‌వి ఇచ్చే అంశంపై ఆయ‌న‌తో చ‌ర్చించినా మాగుంట‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు. ఇక జిల్లాలో తాను రాజ‌కీయంగా ఎంతో సీనియ‌ర్ అయినా టీడీపీలో ఉన్న జూనియ‌ర్లు త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు త‌న వ‌ర్గానికి, జిల్లా ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌లేక‌పోతున్నాన‌న్న ఆవేద‌న‌లో ఆయ‌న ఉన్నారు. జిల్లాలో త‌న‌కు ప్ర‌యారిటీ లేని విష‌యాన్ని ఆయ‌న బాబు దృష్టికి తీసుకువెళ్లినా ఉప‌యోగం లేక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌ని స‌మాచారం.

మాగుంట‌తో ఇప్ప‌టికే వైసీపీ వ‌ర్గాలు చ‌ర్చ‌లు జ‌రిపాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు చీరాల అసెంబ్లీ సీటు ఆఫ‌ర్ చేశార‌ని స‌మాచారం. వైసీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్న మాగుంట తాను చెప్పిన కండీష‌న్ల‌కు ఓకే చెపితేనే పార్టీ మారాల‌ని భావిస్తున్నార‌ట‌. ఏదేమైనా మాగుంట కండీష‌న్ల‌కు వైసీపీ ఓకే చెపితే ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీ మారే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రి ఈ లోగా ఆయ‌న్ను టీడీపీ వాళ్లు ఏదోలా బుజ్జ‌గించుకుంటారో ? లేదో ? చూడాలి.