జగన్ చెంతకు మాజీ మంత్రి!

2019 ఎన్నిక‌ల‌కు వైసీపీ ఇప్ప‌టినుంచే యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆప‌రేష‌న్ ఆకర్ష్‌`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్ప‌డిన గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని కీల‌క నేత‌ల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని వైసీపీ అధిత‌నే జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహిధ‌ర్‌రెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి చేరుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వైసీపీ జిల్లా అధ్యక్షుడుమాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్‌ను కలిసి మానుగుంట చేరికపై ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మహిధ‌ర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బాలినేని కూడా సముఖంగా ఉన్న నేపథ్యంలో త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. కందుకూరు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి గెలుపొందిన పోతుల రామారావు టీడీపీ పార్టీ గూటికి చేరారు. ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా తూమాటి మాధవరావు ఉన్నప్పటికీ పోతుల రామారావును ఎదుర్కొనే సత్తా లేదన్న వాదన వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే మానుగుంటను రంగంలోకి దించేందుకు బాలినేని పావులు కదిపారు. మహిధర్ రెడ్డి గతంలోనే వైసీపీలో చేరాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల‌ వాయిదాపడింది. ఆ సమయంలో కందుకూరు మునిసిపల్ ఎన్నికలు ఇతర కారణాల వల్ల మానుగుంట పార్టీలో చేరలేదు. ప్రస్తుతం మాత్రం ముందుగా జడ్పిటీసీ, ఎంపీపీలు సర్పంచ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో నియోజకవర్గంలో సమర్థ నాయకుడుగా పేరున్న మానుగుంట అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మహీధ‌ర్ రెడ్డిన పార్టీలోకి చేర్చుకునేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్దమయ్యారు.

నియోజకవర్గంలో మానుగుంటకు మంచి పట్టు ఉండటంతోపాటు వైసీపీకి అనుకూలమైన‌ నియోజకవర్గం ఉండటంతో ఆయ‌న చేరికపై బాలినేని ప్రత్యేక దృష్టిసారించారు. అదేవిధంగా త్వరలో కందుకూరుకు మునిసిపల్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈనేపథ్యంలో త్వరలోనే కందుకూరు నుండి మానుగుంట రానున్న ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే మానుగుంటపార్టీలో చేరే తేదీ ఖరారు కానుందని సమాచారం. మ‌రి ప్ర‌కాశంలో బాలినేని వ్యూహాలు ఎంత‌వ‌ర‌కూ ఫలిస్తాయో వేచిచూడాల్సిందే!!