అమ‌రావతిలో ‘ ఠాగూర్ సినిమా ‘ సీన్ రిపీట్‌

మెగాస్టార్ చిరంజీవి – వివి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో 2003లో వ‌చ్చిన ఠాగూర్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సీన్‌లో వ‌చ్చే సీన్ కార్పొరేట్ ఆసుప‌త్రులు ప్ర‌జ‌ల ప్రాణం అనే సెంటిమెంట్‌ను ఎలా క్యాష్ చేసుకుంటాయో చ‌క్క‌గా చూపించారు. చ‌నిపోయిన శవాన్ని ఆసుప‌త్రికి తీసుకువెళితే కూడా ఆ శ‌వానికి ట్రీట్‌మెంట్ చేస్తున్న‌ట్టు యాక్ట్ చేసి డ‌బ్బులు ఎలా గుంజుతారో చూపించిన సీన్ ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది.

ఇప్పుడు అచ్చం ఇదే సీన్ ఏపీ రాజ‌ధాని అమ‌రావతిలో కూడా రిపీట్ అయ్యింది. మంగళగిరి పట్టణంలోని ఓ ఆసుపత్రి దారుణానికి ఒడిగట్టింది. రోడ్డు ప్ర‌మాదంలో స్వ‌రూప అనే ఓ యువ‌తి గాయ‌ప‌డ‌డంతో ఆమెను మంగ‌ళ‌గిరిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీళ్లతో ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆసుప‌త్రి వైద్యులు చికిత్స చేస్తున్నామ‌ని, స్వ‌రూప ప్రాణానికి వ‌చ్చిన ప్ర‌మాదం ఏమీ లేద‌ని చెప్ప‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజుల అనంతరం స్వరూప చనిపోయిందని, మిగిలిన డబ్బు చెల్లించి శవాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్ప‌డంతో స్వ‌రూప కుటుంబ స‌భ్యులు షాక్ అయిపోయారు.

దీంతో భోరున విల‌పించిన స్వరూప కుటుంబసభ్యులు ఆసుపత్రి తమను మోసం చేసిందని ఆరోపించారు. స్వరూప ముందే మరణించినా ఆ విషయాన్ని బయటపెట్టకుండా వైద్య అవసరాలకు రూ.1.50 లక్షలు గుంజారని, ఇంకా డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారని చెప్పారు. దీంతో ఈ సంఘ‌ట‌న అచ్చం ఠాగూర్ సినిమాలో సీన్‌ను త‌ల‌పించేలా ఉంద‌ని, త‌క్ష‌ణ‌మే ఆసుప‌త్రి మేనేజ్‌మెంట్‌, వైద్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్వ‌రూప కుటుంబ స‌భ్యుల‌తో పాటు ప్ర‌జాసంఘాలు ఫైర్ అవుతున్నాయి.

https://youtu.be/-XCv7hNCg0I