ఆ మంత్రి ఇంకా ప‌ట్టు సాధించ‌లేదా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. లీడ‌ర్ షిప్ క్వాలిటీకి కేరాఫ్‌. ఆయ‌న పాల‌న అంటే.. అన్ని రంగాల‌పైనా ప‌ట్టు గ్యారెంటీ! అదేవిధంగా ఆయ‌న టీం మంత్రుల‌కు కూడా బాబు ఇదే ఫిలాస‌ఫీ నేర్పిస్తారు. ముందు వారివారి విభాగాల‌పై ప‌ట్టుసాధించాల‌ని చెబుతారు. దీంతో వారు స్వ‌ల్ప కాలంలోనే బాబు సూచ‌న‌ల మేర‌కు పాల‌న‌పై ప‌ట్టు బిగిస్తారు. అయితే, ఇప్పుడు ఓ మంత్రి మాత్రం ఇంకా పాల‌న‌పై ప‌ట్టు సాధించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వర్గ విస్త‌ర‌ణ‌లో బాబు కేబినెట్‌లో సీటు కొట్టేసిన స‌ద‌రు మంత్రి ఇంకా సీరియ‌స్‌గా దృష్టి పెట్ట‌లేద‌ని తెలుస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. భూగర్భ గనుల శాఖా మంత్రి ఆర్‌వీ సుజయ కృష్ణ రంగారావు ఏప్రిల్ లో జ‌రిగిన మంత్రివర్గ విస్తరణలో గ‌నుల శాఖ‌ను దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలిపొందిన సుజయకృష్ణ.. ఇంకా ఈ శాఖ‌పై ప‌ట్టు సాధించ‌లేద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మినహా…పాలనా పరంగా తన వ్యక్తిగత ముద్ర వేసుకోలేకపోతున్నారట‌! ముఖ్యంగా ఆయ‌న‌కు టీడీపీకి కొత్త కావడం, సీనియర్ నాయకులతో అంత చనువు లేకపోవడం.. ఇబ్బందికరంగా మారిందట‌.

కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీడలో ఉన్నందున.. తన కంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తింది. ఈయనకు ముందు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కిమిడి మృణాళిని తరహాలోనే సుజయ్ కూడా వెళ్తున్నారన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి రంగారావుతో స్వేచ్చగా తమ సమస్యలను, అభిప్రాయాలను చెప్పలేకపోతున్నారట. ముఖ్యంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలో అంటిముట్టనట్టు వ్యవహరించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వ్యవహారం జరుగుతుండగా సుజయ్ కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.

ఇలా.. కొత్త మంత్రిపై ఇప్ప‌టికే అనేక ఫిర్యాదులు వ‌స్తున్నాయి. జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, ఆయ‌న మాత్రం బెల్ల‌కొట్టిన రాయిలా మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు. నిజానికి ఈయ‌న‌తోపాటు మంత్రి ప‌ద‌విని చేప‌ట్టిన భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ దూసుకుపోతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ఇమేజ్‌ను సొంతం చేసుకుంటోంది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు నుంచి ప్ర‌త్యేకంగా నిధులు సైతం రాబ‌డుతోంది. అలాంటిది సుజ‌నా మాత్రం రాజ‌కీయ అనుభవం ఉండి కూడా ఎందుకిలా మౌనంగా ఉంటున్నార‌ని స్థానికులు చ‌ర్చించుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.