కొత్త మంత్రికి ఎమ్మెల్యేల స‌హాయ నిరాక‌ర‌ణ‌

కొత్త‌గా మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన మంత్రుల‌కు స‌రికొత్త స‌మ‌స్య‌లు ఆహ్వానిస్తున్నాయి . వేరే పార్టీ నుంచి వ‌చ్చి.. మంత్రి ప‌ద‌వులు పొందిన వారి జిల్లాల్లో వారికి ఎమ్మెల్యేల నుంచి ఏ మేర‌కు సహాయం అందుతుందోన‌నే చ‌ర్చ ఇప్పుడు తీవ్ర‌మైంది. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఇప్ప‌టికే ఇది నివురుగ‌ప్పిన నిప్పులా మారింది. ప్రస్తుతం ఇక్క‌డి నుంచి సుజ‌య కృష్ణ రంగారావు మంత్రి ఎంపిక‌వ‌గా.. ఆయ‌న ముందు ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌లు స‌వాలు విసురుతున్నాయి. గతంలో మృణాళిణి.. ఇప్పుడు కృష్ణకు ఎమ్మెల్యేలు స‌హాయ నిరాక‌ర‌ణ చేప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని జిల్లా రాజ‌కీయాల్లో బ‌ల‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

జిల్లా టీడీపీ రాజకీయాల్లో కొత్త టెన్షన్ మొదలైంది. బొబ్బిలి ఎమ్యెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తి మొదలైంది. మంత్రి పదవి కోసం తెలుగుదేశం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత, కెఎ నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ప్రతిపక్ష వైసీపీ నుంచి పార్టీలో చేరిన సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడంతో సీనియర్ నాయకులు అల‌క పాన్పు ఎక్కారు. గతంలోనూ మృణాళిని మంత్రిగా ఉన్పప్పుడు జిల్లా ఎమ్మెల్యేలు ఆమెకు అంతగా సహకరించలేదు.

పక్క జిల్లాకు చెందిన మృణాళినికి మంత్రి పదవి కేటాయించడం జిల్లా నాయకులకు రుచించలేదు. ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన సుజయ రంగారావుకు మంత్రి పదవి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తున్న తమను పరిగణన‌లోకి తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సుజయ రంగారావుకు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ఘనంగా స్వాగతం పలికినా…అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం ముభావంగానే కనిపించారు.

ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో ఉన్న మెజార్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలను కాదని, నిన్న మొన్న పార్టీలోకి వచ్చి చేరిన వారిని అందలం ఎక్కించడంపై స్థానిక నేతలు లోలోపలే మథ‌నపడిపోతున్నారు. మరి ఈ పరిస్థితులను సమ‌ర్థంగా ప‌రిష్క‌రించి.. ఎమ్మెల్యేల‌ను త‌న చెప్పు చేతల్లో పెట్టుకోవాల్సిన బాధ్య‌త‌ మంత్రి సుజయకృష్ణ రంగారావుపై ఉంది. మ‌రి క‌త్తిమీద సాము లాంటి ఈ వ్య‌వ‌హారాన్ని ఆయ‌న ఎలా అధిగమిస్తారో వేచిచూడాల్సిందే!