అమ‌రావ‌తిలో ఎమ్మెల్యేల ఇళ్ల సాక్షిగా అదిరే స్కామ్‌

అవును! ఇప్పుడు అమ‌రావ‌తిలో ఈ మాటే విన‌బ‌డుతోంది. ప్ర‌భుత్వ నిర్మాణాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల సొమ్మును బొక్కేసేందుకు `కొంద‌రు పెద్ద‌లు` స్కెచ్ గీశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అనేక నిర్మాణాల‌కు భారీ మొత్తంలో కొటేష‌న్ వేస్తూ.. మార్జిన్ల రూపంలో డ‌బ్బు దోచేస్తున్నార‌నే వార్త‌లు మోత‌మోగిపోతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి పారింద‌ని పెద్ద ఎత్తున విప‌క్షాలు ఆందోళ‌న చేయ‌డం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అమ‌రావ‌తి క‌ట్ట‌డాల‌పైనా అవినీతి మ‌ర‌క‌లు అంటుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే..

రాజ‌ధాని ప్రాంతంలో ప‌నిచేసే ఉన్న‌తాధికారుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పెద్ద ఎత్తున నివాసాల‌ను స‌మ‌కూర్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తిలో వారికి అపార్టుమెంట్ల‌ను నిర్మించి ఇవ్వాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక ను సిద్ధం చేసింది. దీనిని అమ‌లు చేసే బాధ్య‌త‌ను సీఆర్‌డీఏకు ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ఈ క్ర‌మంలోనే సీఆర్‌డీఏ అధికారులు నిన్న ప్ర‌క‌ట‌న జారీ చేశారు. దీని ప్ర‌కారం…18 టవర్స్ కింద ప్రజా ప్రతినిధులు..ఐఏఎస్ లకు 609 కోట్ల రూపాయలు వెచ్చించి 432 అపార్ట్ మెంట్లను నిర్మించనున్నారు. ఈ లెక్కన చూస్తే ఒక్కో అపార్ట్ మెంట్ వ్యయం 1.40 కోట్ల రూపాయలుగా పడుతుంది.

అంటే భూమి ధర కాకుండా కేవలం నిర్మాణ ఖర్చులకే అపార్ట్ మెంట్‌కి 1.40 కోట్ల రూపాయల ధర నిర్ణ‌యించారు. అయితే, ఇంత ధ‌ర అక్క‌ర లేద‌ని, హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో కూడా భూమి ధ‌ర క‌లుపుకొని చూసినా ప్ర‌స్తుతం సీఆర్‌డీఏ నిర్ణ‌యించింది భారీగా ఉంది. దీనిని బ‌ట్టి ఈ నిర్మాణాల వెనుక ఏదైనా స్కాం దాగి ఉండొచ్చ‌ని నిపుణులు అంటున్నారు.

ఒక్కో అపార్ట్ మెంట్ మూడు వేల చదరపు అడుగుల్లో నిర్మించినా అడుగుకు నాలుగు వేల ధర వేసుకున్నా..ఆ మొత్తం 1.20 కోట్ల రూపాయలు దాటదు. అయితే, 1.40 కోట్ల నిర్ణ‌యం వెనుక‌ ప్రభుత్వ పెద్దల స్కెచ్ ఉండి ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల సొమ్ము బొక్కేందుకు బోలెడు దారులు అన్న‌ట్టుగా అపార్ట్ మెంట్ల‌ను సైతం మింగేసేందుకు నేత‌లు నిర్ణ‌యించార‌ని అంటున్నారు. మ‌రి రాబోయే రోజుల్లో దీని అస‌లు స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డుతుందేమో చూడాలి.