ప్రాణ స్నేహితుల మ‌ధ్య ఎమ్మెల్యే సీటు చిచ్చు

పాలిటిక్స్‌కి ప్రేమ లేదు. అధికారమే త‌ప్ప‌. పాలిటిక్స్‌కి సెంటిమెంట్ తెలియ‌దు.. అధికార‌మే త‌ప్ప‌! అది అన్న‌యినా, త‌మ్ముడైనా, ఆఖ‌రికి క‌ట్టుకున్న భార్య అయినా, మూడుముళ్లు వేసిన భ‌ర్త అయినా.. అంతా జాన్తానై! పాలిటిక్స్ నేర్పుతోంది ఇదే. ఇప్పుడు తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామంలోనూ ఇదే విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్రాణ స్నేహితులు కూడా ఓ ఎమ్మెల్యే సీటు కోసం ర‌చ్చ‌ర‌చ్చ చేసుకున్నారు. ఉన్న ప‌రువు తీసుకున్నారు. మ‌రి వారి సంగ‌తేంటో చూద్దామా? తెలంగాణ‌లోని న‌ల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రకుమార్, నల్లగొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలూ నాయక్. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు.

బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సీపీఐ నేత‌. 2014 ఎన్నికల్లో రవీంద్ర నాయక్ సీపీఐ టికెట్‌పై దేవరకొండ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ లో చేరి జడ్పీ ఛైర్మన్ అయ్యారు. అయితే 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాలు నాయక్ జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో కలిసి అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని నమ్ముకుని టీఆర్ఎస్ లో కొన‌సాగుతున్నారు. ఇక రవీంద్రకుమార్ కూడా వామ‌ప‌క్ష సిద్దాంతాల‌కు తిలోద‌కాలిచ్చి.. 2016లో గులాబీ కండువా కప్పుకున్నారు.

రవీంద్రకుమార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని నమ్ముకుని గులాబీ పార్టీలో ఆయనతో పాటు చేరిపోయారు. జడ్పీ ఛైర్మన్ బాలూ నాయక్ కు ఎమ్మెల్యే అవ్వాలని కోరిక బలంగా ఉంది. తనకు అనుకూలం దేవరకొండ నియోజకవర్గమని భావించిన బాలూ నాయక్ టీఆర్ఎస్ లో చేరేటప్పుడే టిక్కెట్ కోసం హామీ తీసుకున్నారు. అయితే అనూహ్యంగా తన స్నేహితుడు రవీంద్రకుమార్ చేరడంతో ఆయన కొంత ఇబ్బందిగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, పైగా పార్టీ మారి రావడంతో రవీంద్రకుమార్ కే వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుండంటంతో స్నేహితుడితోనే ఢీ అంటే ఢీ అంటున్నారు.

రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో తమ వర్గాన్ని పట్టించుకోవడం లేదంటూ బాలూ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బతుకమ్మ చీరల పంపిణీ సమయంలోనూ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇక భూరికార్డుల గ్రామసభల్లో ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ను బాలూ నాయక్ అనుచరులు దాడిచేసేంత ప్రయత్నం చేశారు. ఇలా ఇద్దరి స్నేహితుల మధ్య దేవరకొండ సీటు చిచ్చుపెట్టింది. వీరిద్దరి మధ్య పంచాయతీని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పరిష్కరించడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో ఇప్పుడు ఇరువురు నేత‌లూ ఎడ‌మొహం, పెడమొహం అన్న‌ట్టుగానే ఉన్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.