ఇద్ద‌రు చంద్రుల‌కు మోదీ మ‌ళ్లీ షాక్‌?

సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దేశ గ‌తినే మార్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు ప్ర‌ధాని మోదీ! ఇదే స‌మ‌యంలో ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల‌కు కొన్ని ఎదురు దెబ్బలు కూడా త‌గులుతున్నాయి. కానీ వాటిని క‌నిపించ‌కుండా చేస్తున్నారు ఇద్ద‌రు చంద్రులు! ఇప్పుడు వీరికి మ‌రో పిడుగులాంటి వార్త! రాజ‌కీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణ‌యాన్ని మోదీ తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. అసంతృప్తుల‌ను బుజ్జ‌గించేందుకు ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొంద‌రిని మండ‌లికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దుచేయాల‌ని మోదీ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంతేగాక దీనిపై అభిప్రాయాలు తెలియ‌జేయాల‌ని ఇరు రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు కూడా రాశార‌ట‌.

శాస‌న మండ‌లి…గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ల‌పై మాజీ సీఎం దివంగ‌త ఎన్టీ రామారావు చిర్రుబుర్రులాడుతూ ఉండేవారు. అందుకే ఏకంగా ఒక్క క‌లంపోటు పొడిచారు. మ‌ళ్లీ వైయ‌స్ఆర్ కృపాకటాక్షాల‌తో ఏపీలో అది పురుడు పోసుకుంది. రాజ‌కీయ శ‌ర‌ణార్థుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించేందుకూ, త‌మ‌కు ఇబ్బందులు క‌లిగించే రాజ‌కీయ నాయ‌కుల‌ను ఊర‌డించేందుకు అధికార ప‌క్షాలు వాటిని వినియోగిస్తూ వ‌స్తున్నాయి. ఇటు ఏపీలో టీడీపీకి, అటు తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి కొంత ఊర‌ట‌నిస్తోంది ప్ర‌స్తుతం అవినీతిపై కొర‌డా ఝుళిపిస్తున్న మోదీ.. ఇప్పుడు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లో ఖ‌ర్చును అదుపుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

రాష్ట్రాల్లో శాస‌న మండ‌లులు అవ‌స‌ర‌మా అనే సందేహం ప్ర‌ధాని మోదీకి వ‌చ్చింది. అందుకే అనుకున్న‌దే త‌డ‌వుగా ఈ విష‌యంపై ఇద్ద‌రు సీఎంలు చంద్ర‌బాబు, కేసీఆర్‌ల‌కు మోదీ లేఖ రాశారు. శాస‌న మండ‌లులు అవ‌స‌ర‌మా వివ‌రిస్తూ స‌మాధానం రాయాల‌నేది ఆ లేఖ సారాంశం. నిజానికి శాస‌న మండ‌లి కావాలా వ‌ద్దా అనేది ఆయా రాష్ట్రాల విచ‌క్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. రాజ‌కీయ అవ‌స‌రాలు దీన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. దేశంలో ప్ర‌స్తుతం 7 రాష్ట్రాల్లో మండ‌లి వ్య‌వ‌స్థ ఉంది. క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, జ‌మ్మూ కాశ్మీర్‌ల‌తో పాటు ఏపీ, తెలంగాణ‌ల్లో శాస‌న మండ‌లులు ఉన్నాయి. వీటిలో మూడు రాష్ట్రాల‌లో బీజేపీ అధికారంలో ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిత్ర‌ప‌క్షంతో అధికారం పంచుకుంటోంది. శాస‌న మండ‌లిని ర‌ద్దు చేయాలంటే ముందు తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని మూసేసి, మిగిలిన రాష్ట్రాల జోలికి వెళ్లాలి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో దూకుడుమీదున్న ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ దాస్ ఇందుకు సుముఖంగానే ఉంటారు. మ‌రి ఏపీ, తెలంగాణ సీఎంలు ఏ నిర్ణ‌యం రాసి పంపుతార‌నే ప్ర‌శ్నార్థ‌కం. ముందు గొయ్యి.. వెనుక నుయ్యిలా మారింది ప‌రిస్థితి! ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఏ నిర్ణ‌యం తీసుకోక ఇబ్బందులు పుడుతున్న ఏపీకి.. ఇది కచ్చితంగా ఎదురుదెబ్బే!!