ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్‌లోనూ.. కాషాయం మార్క్ పాలిటిక్సే!!

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌న్నీ.. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చుట్టూ తిరుగుతున్నాయి. జూలైలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ స్థానంలో మ‌రో కొత్త‌వారిని కొలువుదీర్చాలి. దీనికి సంబంధించి ఇప్పుడు హ‌స్తిన రాజ‌కీయాలు బోగి మంట మాదిరిగా వేడెక్కాయి. అయితే, ఇక్క‌డే బీజేపీ సార‌ధి అమిత్ షా, ప్ర‌ధాని మోడీల వ్యూహం వ్యూహాత్మ‌కంగా సాగుతోంది! క‌ర‌డుగ‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ వాదులైన ఇద్ద‌రూ త‌మ‌కు అనుకూలురైన వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కూర్చోపెట్టాల‌ని భావిస్తున్నారు.

అయితే, ప్ర‌స్తుతం ఎన్డీయే ప్ర‌భుత్వంలోని మిత్ర‌ప‌క్షాల‌న్నీ మోడీ, షాల నిర్ణ‌యానికి జై కొట్టినా.. ఎల‌క్టోర‌ల్ కాలేజీలో వీరికి ఉన్న ఓట్ల శాతం రాష్ట్ర‌ప‌తిని ఎన్నుకునేందుకు స‌రిపోవ‌డం లేదు. దీంతో మ‌రికొన్ని ప‌క్షాల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి అయింది. దీంతో ఇప్పుడు క‌ర్ర విర‌గ‌కుండా పాము చావ‌కుండా అన్న మంత్రాన్ని ప‌ఠిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర మంత్రులు.. వెంక‌య్య‌, జైట్లీ, రాజ్‌నాథ్‌ల‌తో త్రిస‌భ్య క‌మిటీని నియ‌మించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌భుత్వంలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి విష‌యంలో దాగుడుమూత‌లాట ఆడుతోంది.

ఉమ్మ‌డి నిర్ణ‌యంతో ఎలాంటి పోటీ లేకుండా రాష్ట్ర‌ప‌తిని ఎంపిక చేయాల‌ని ప్ర‌క‌టించిన నేత‌లు ఈ విష‌యంలో తమ అభ్య‌ర్థిని వెల్ల‌డించ‌కుండా తొలుత సోనియా గ‌డ‌ప తొక్కి వారి అభ్య‌ర్థి ఎవ‌ర‌ని ప్ర‌శ్నించ‌డమే మోడీ, షాలు భ‌య‌ప‌డుతున్నార‌న‌డానికి ప‌రాకాష్ట‌. నిజానికి త‌మ అభ్య‌ర్థి ఫ‌లానా వార‌ని ప్ర‌క‌టించి.. మిగిలిన ప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డం ఎక్క‌డైనా ప‌రిపాటి. కానీ, మోడీ, షాలు ఈ విష‌యంలో త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే.. ఎక్క‌డ కొంప మునుగుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నార‌ని ఢిల్లీ మీడియా అంటోంది!

ఇక‌, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టుల విష‌యానికి వ‌స్తే.. లౌకిక భావాలున్న అభ్య‌ర్థిని నిల‌బెడితే అభ్యంత‌రం లేద‌ని అంటున్నారు. అయితే, లౌకిక భావాలున్న‌వారు మోడీకి, షాకు వ‌ర్క‌వుట్ అవుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌. అందుకే వీరు త‌మ అభ్య‌ర్తిని దాచి పెడుతూ.. మిగిలిన ప‌క్షాలను ప్ర‌శ్నించ‌డం ఏ మేర‌కు స‌బ‌బు అనేది ప్ర‌శ్న‌. మొత్తానికి ఇప్ప‌టికైతే.. అభ్య‌ర్థి ఎంపిక దాదాపు అయిపోయింద‌ని, కేవ‌లం కాంగ్రెస్ స‌హా మిగిలిన ప‌క్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకే ఇదంతా జ‌రుగుతోంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఈ ఉత్కంఠ మ‌రికొన్ని రోజులు కొన‌సాగనుంది!!