మోడీ మార్క్‌.. బాబును తొక్కి పెడుతున్నారా

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే సామాన్యుడు కారు! అని ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ప‌దే ప‌దే చెబుతుంటారు. గుజ‌రాత్‌ను పాలించిన స‌మ‌యంలో ఇష్ర‌త్ జ‌హాన్ కేసును తిర‌గ‌తోడిన కార‌ణంగా ఆ రాష్ట్రానికి చెందిన ఓ న్యాయ‌మూర్తికే మోడీ వాత పెట్టారు. పోలీసు అధికారుల‌ను శంక‌రగిరి మాన్యాలు ప‌ట్టించారు. అలాంటి మోడీ ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు మాట వింటార‌ని, బాబు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటార‌ని అనుకోవ‌డం భ్ర‌మేన‌ని చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన, జ‌రుగుత‌న్న ప‌రిణామాలు ఈ విష‌యాన్నే స్ప‌ష్టం చేస్తున్నాయి. 

ప్ర‌ధానంగా రెండు విష‌యాల్లో మోడీ బాబును దెబ్బ‌తీశార‌నే కామెంట్లు ఢిల్లీ స‌హా హైద‌రాబాద్‌, అమ‌రావ‌తిల్లో వినిపిస్తున్నాయి. “నాకు ఢిల్లీలో భారీ ప‌లుకుబ‌డి ఉంది. నేను ఏం చెప్పినా ప‌న‌వుతుంది“ అంటూ గొప్ప‌లు పోయే బాబుకు మోడీ గాలి తీసేసిన ఘ‌ట‌న‌లు చాలా విచిత్రంగా కూడా ఉన్నాయి. బాబు ఇమేజ్‌కి సంబంధించిన విష‌యం తెలంగాణ పార్టీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి వ్య‌వ‌హారం. మోత్కుప‌ల్లి న‌ర్సింహులుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇవ్వాల‌ని 2014 నుంచి బాబు ఢిల్లీ పెద్ద‌ల‌ను కోరుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు మోక్షం క‌ల‌గ‌లేదు.

తాజాగా ఐదుగురు కొత్త గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించినా మోత్కుప‌ల్లి పేరు ఎక్క‌డా క‌నిపించ‌లేదు, క‌నీసం వినిపించ‌లేదు. దీంతో తెలంగాణ టీడీపీలో చంద్ర‌బాబు `ఢిల్లీ ఇమేజ్‌` క‌రివేపాకు క‌న్నా ఘోరంగా త‌యారైంద‌ని అంటున్నారు. ఇప్పుడు అస‌లు అక్క‌డి నేత‌ల‌తో మాట్లాడాలంటేనే బాబుకు మొహం చెల్ల‌డం లేద‌ని స‌మాచారం. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి కేంద్రం కోరిన‌వ‌న్నీ బాబు చేశారు. అడ‌గ‌గానే ఇద్ద‌రికి రాజ్య‌స‌భ సీట్లు త‌న కోటాలో కేటాయించారు. రాష్ట్ర కేబినెట్‌లో ఇద్ద‌రు బీజేపీ మంత్రుల‌కు స్థానం క‌ల్పించారు. 

అయితే, బాబు కోరిన‌వి కానీ, క‌నీసం విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వి కానీ ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ కానీ, ఢిల్లీ పెద్ద‌లు కానీ తీర్చ‌లేదు. పైగా బాబుపై ఎదురుదాడి చేస్తుండ‌డం మ‌రింత దారుణం. విభ‌జ‌న త‌ర్వాత రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుపై మీ లెక్కలు బోగస్.. అంటూ బాబుకు హార్ట్ బీట్ పెంచేస్తున్నారు.  ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్యాకేజీ ప్ర‌క‌టించినా.. అందులో హామీల‌ను లెక్క‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన పాపాన  పోలేదు. అదేవిధంగా అసెంబ్లీ స్థానాల పెంపుపైనా మోడీ ప‌క్కాగా హ్యాండిచ్చారు.  విశాఖకు రైల్వే జోన్ ఎప్పుడో అట‌కెక్కించేశారు.  దీంతో రాష్ట్ర అభివృద్ధి ఆమ‌డ దూరంలో ఉండిపోయింది. మ‌రి బాబు.. త‌న‌కు ఢిల్లీలో మంచి ప‌లుకుబ‌డి ఉంద‌ని చెబుతున్న మాట‌ల‌ను ఎలా విశ్వ‌సించాలో తెలియ‌డం లేదు.