మోడీ రాజ‌కీయం అదుర్స్‌ …మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి!

పాలిటిక్స్‌లో ఎవ‌రూ ప‌ర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండ‌ర‌నేది మ‌రో సారి ప్ర‌ధాని మోడీ కూడా నిరూపించే ప్ర‌య‌త్నంలో ఉన్నారా? అంటే ఔన‌నే అనిపిస్తోంది. 2014లో చేతులు ప‌ట్టుకుని చెమ్మ‌చెక్క‌లాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో తెలంగాణ‌లో త‌మ‌కు గిట్ట‌ని, త‌మ‌తో పొసగ‌ని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది.

నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగ‌స్వామి కాదు. అయిన‌ప్ప‌టికీ.. మోడీ.. కేసీఆర్ స‌ర్కార్ ఏం కోరినా వెంట‌నే చేసేస్తున్నార‌ట‌. దీనిలో భాగంగానే మిష‌న్ బ‌గీర‌థ‌కు కేంద్రం నుంచి అనుమ‌తులు వ‌చ్చేశాయ‌ని అంటున్నారు. ఇక‌, టీఆర్ ఎస్‌ విష‌యానికి వ‌స్తే.. అధినేత కేసీఆర్ కూడా బీజేపీ విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిన్న‌టినిన్న అమిత్ షా.. కేసీఆర్ స‌ర్కారుని ఉతికి ఆరేశారు. కేంద్రం నిధులుఇస్తున్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ‌డంలో కేసీఆర్ స‌ర్కారు తీవ్ర నిర్ల‌క్ష్యంగా ఉంద‌ని అన్నారు.

రాబోయే రెండేళ్ల త‌ర్వాత తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భుత్వం రావడం త‌థ్య‌మ‌ని నొక్కి చెప్పారు. నిజానికి ఈ రేంజ్‌లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు సంధిస్తే.. కేసీఆర్ అండ్ కోలు తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోవ‌డం ఖాయం. అయితే, ఈ సారి మాత్రం కేసీఆర్ మౌనం పాటించేశారు. ఎవ‌రూ నోరు మెద‌పొద్దంటూ సున్నితంగా సూచించారు. షా కామెంట్లు అన్నీ ప‌రిశీలించి మాట్లాడ‌దామ‌ని అన్న‌ట్టు తెలిసింది.

మొత్తానికి షా పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌–బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర చర్చ రెండు పార్టీల్లోనూ జరుగుతోంది. మ‌రోప‌క్క‌, ఏపీలో చంద్ర‌బాబుతో క‌టీఫ్‌పై బీజేపీ ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.