మోడీ మెగా ప్లాన్‌: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!

2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ఢిల్లీ పీఠం వ‌రుస‌గా రెండోసారి అధిష్టించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో మోడీ అనుస‌రించిన వ్యూహానికి విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావే లేకుండా పోయింది. దీంతో ఆయ‌న‌తో విబేధించే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి మోడీ క‌ల్పించారు. ఇక్క‌డ ఎవ్వ‌రు విమ‌ర్శించినా ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి.

రాష్ట్ర‌ప‌తి రేసులో ఎన్డీయే నుంచి చాలా పేర్లు వినిపించినా మోడీ మాత్రం ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు నార్త్‌లో మోడీ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. కీల‌క‌మైన యూపీలో తిరుగులేని మెజార్టీతో విజ‌యం సాధించారు. ఇక ఇప్పుడు మోడీ టార్గెట్ సౌత్ మీదే ఉంది. ఈ క్ర‌మంలోనే ఉప రాష్ట్ర‌ప‌తి ఎంపిక‌లో మ‌రో షాకింగ్ డెసిష‌న్ ఆయ‌న తీసుకోనున్నారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు జాతీయ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

రాష్ట్ర‌ప‌తిగా ఉత్త‌రాదికి చెందిన‌ ద‌ళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను ఎంపిక చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన మోడీ ఇప్పుడు ఉప రాష్ట్ర‌ప‌తి ఎంపిక‌లో మ‌రో స‌రికొత్త వ్యూహానికి తెర‌దీస్తున్నార‌ని టాక్‌. ఉప రాష్ట్ర‌ప‌తిగా తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ అయిన న‌ర‌సింహ‌న్‌కు ఛాన్స్ ఇస్తార‌ని తెలుస్తోంది. వాస్త‌వంగా కాంగ్రెస్‌లో ఎక్కువుగా బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం ఉంటుంది. బీజేపీలోను గ‌తంలో వీరిదే ఆధిప‌త్యం.

ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి రేసులోను ఎన్డీయే నుంచి బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్లు పోటీప‌డ్డారు. అయితే మోడీ వాళ్ల‌కు చెక్‌పెట్టేలా ద‌ళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రంగంలోకి దించారు. ఇప్పుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన‌, అందులోను ద‌క్షిణాదికి చెందిన న‌ర‌సింహ‌న్‌ను ఎంపిక చేస్తే మోడీకి రెండు ర‌కాలుగా లాభం క‌లుగుతుంది. అటు బ్రాహ్మ‌ణుల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డంతో పాటు ఈ పోస్టును సౌత్‌కు ఇచ్చిన పేరు, ఇక దీనిని బీజేపీలో ఎవ్వ‌రూ అడ‌గ‌కుండా వాళ్ల‌కు నోటికి తాళం వేసేశారు.

ఇక మోడీ ప్లాన్ ఎలా ఉన్నా కొద్ది రోజుల క్రితం న‌ర‌సింహ‌న్ సైతం తాను దేవుడి ద‌య ఉంటే ఉప రాష్ట్ర‌ప‌తి అవుతాన‌ని వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఇప్పుడు కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తోన్న వారు న‌ర‌సింహ‌న్ ఉప రాష్ట్ర‌ప‌తి రేసులో ఉన్నార‌ని చ‌ర్చించుకుంటున్నారు.