అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు

టీడీపీలో ఓ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగ‌లేక‌పోతున్నారా ? స‌ద‌రు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవున‌నే అంటున్నారు ఏపీలోని రాజ‌కీయ విశ్లేష‌కులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. గత ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి గుంటూరు ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావ‌డంతో మోదుగుల‌కు చంద్ర‌బాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు.

అప్ప‌ట్లో చంద్ర‌బాబు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు మోదుగుల బ‌హిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న త‌ర్వాత కూడా చంద్ర‌బాబు మోదుగుల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కీల‌క‌మైన మిర్చియార్డు చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో కూడా మోదుగుల మాట చెల్ల‌లేదు. చంద్ర‌బాబు మోదుగుల‌ను కాద‌ని మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు మాట‌కే ఓటేశారు. ఆ త‌ర్వాత మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో రెడ్డి కోటాలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి గ్యారెంటీ అని మోదుగుల ధీమాతో ఉన్నారు.

మోదుగుల‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో అప్ప‌టి నుంచి ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. పార్టీ అధిష్టానంపై రుస‌రుస‌లాడుతున్నారు. తాజాగా ఆయ‌న మ‌రోసారి ప్ర‌భుత్వ ప‌నితీరుపై ఓపెన్‌గానే విరుచుకుప‌డ్డారు.

చంద్రన్న బీమా పథకం తన నియోజకవర్గంలో అమలు కావడం లేదన్నారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు – నక్కా ఆనందబాబు సమక్షంలోనే మోదుగుల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జూట్ మిల్ కార్మికుల స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయ‌న్న ఆయ‌న న‌గ‌రంలోని హోట‌ళ్ల‌లో బాల‌కార్మికుల వెత‌లు కూడా ఎవ్వ‌రికి ప‌ట్ట‌డం లేద‌ని… చంద్రన్న బీమా వల్ల కార్మికులకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

పార్టీ మార్పుపై ఊహాగానాలు..!

మోదుగుల వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు ఎప్పుడైనా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీల చేర‌తార‌ని గుంటూరు జిల్లా రాజ‌కీయాల్లో ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మోదుగుల బావ అయోధ్య రామిరెడ్డి న‌ర‌సారావుపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయ‌న ద్వారా మోదుగుల వైసీపీలోకి వెళ్లే అంశంపై కూడా త‌న అత్యంత స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని కూడా టాక్. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మోదుగుల రూట్ ఎలా ఉంటుందో చూడాలి.