చంద్రబాబుకి షాక్: బాబు హెచ్చరికలను పట్టించుకోని మోదుగుల

ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయం. ప్యాకేజీలో లేనిది.. హోదాలో ఏముంది? హోదా క‌న్నా ప్యాకేజీనే అద్బుతం. హోదా పేరు ఎత్త‌డం కూడా పాప‌మే! ఇవ‌న్నీ ఏపీ సీఎం చంద్ర‌బాబు డైలాగ్‌లు. దీంతో వీటినే రాష్ట్రంలో మంత్రులు, టీడీపీ నేత‌లు ప‌దే ప‌దే వ‌ల్లెవేస్తున్నారు. అంతేకాదు, హోదా గురించి మాట్లాడేవారు అభివృద్ధి నిరోధ‌కులుగా కూడా బాబు ముద్ర‌వేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు బాబుకు ఎక్క‌డో కాలే విధంగా కామెంట్లు చేశాడు గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల.

ఏపీకి ప్రత్యేక హోదాపై ఎమ్మెల్యే మోదుగుల మాత్రం అందుకు రివర్స్‌లో వెళుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి ఫుల్‌ స్టాప్‌ పడలేదని., కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కామా మాత్రమే పెట్టిందని మోదుగుల చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచితే ఖచ్చితంగా బీజేపీ-టీడీపీలు ఇరకాటంలో పడతాయని., అప్పుడు ప్రత్యేక హోదాను మళ్లీ ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో ఇంకా సెంటిమెంట్లు ఉన్నాయని., దానిపై రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలున్నాయని మోదుగుల చెబుతున్నారు.

మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరికలను పట్టించుకోకుండా మోదుగుల చేసిన వ్యాఖ‌్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మోదుగుల త‌న‌కు సీటు ల‌భిస్తుంద‌ని ఆశించారు. అయితే, ఆయ‌న పేరును కూడా చంద్ర‌బాబు గుర్తుంచు కోలేదు. దీంతో మోదుగుల తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న అప్ప‌ట్లోనూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అప్ప‌ట్లోనే మోదుగుల‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.