ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలయ్య

February 6, 2017 at 12:15 pm
440000

తెలుగు జాతి కీర్తిని న‌లుదిశ‌లా చాటి చెప్పిన నంద‌మూరి తార‌క రామారావు, ఉర‌ఫ్ అన్న‌గారి జీవితం ఇక స‌చిత్రం కానుంది. త‌మిళ‌నాట ఎంజీఆర్‌ని మించిన ఆద‌ర‌ణ‌తో పార్టీని స్థాపించిన నాలుగు మాసాల్లోనే అధికారంలోకి వ‌చ్చిన ఎన్‌టీఆర్.. తెలుగు జాతి పౌరుషాన్ని ఇండియాగేట్‌కు రుచిచూపించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయం. రెండింటినీ త‌న‌దైన శైలితో ర‌క్తి క‌ట్టించి ఏపీలో తిరుగులేని నేత‌గా ఎదిగిన అన్న‌గారి జీవితం ఇక తెర‌మీద‌కి రానుంది. ఈ చిత్రంలో అన్న‌గారి ముద్దుల కుమారుడు బాల‌య్యే ఎన్‌టీఆర్ రోల్ పోషించ‌నుండ‌డం ఆస‌క్తిక‌ర విష‌యం.

చారిత్రక కథాంశంతో గౌతమీపుత్ర శాతకర్ణిని వందో సినిమాగా తీసిన  బాలకృష్ణ తాజాగా త‌న తండ్రి, తెలుగు ప్ర‌జ‌ల అన్న‌గారు ఎన్‌టీఆర్ జీవితాన్ని త్వరలో సినిమాగా తీయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో తానే నటిస్తానని బాల‌య్య‌ చెప్పారు. ఈ సినిమాకు దర్శకుడు, నిర్మాతలను త్వరలో ప్రకటిస్తానని వెల్ల‌డించా. ఈ మేర‌కు సోమవారం బాలకృష్ణ తన తండ్రిగారి ఊరైన‌ కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. బాలకృష్ణ వెంట ఆయన అల్లుడు నారా లోకేశ్‌ కూడా ఉన్నారు.

ఈ సంధ‌ర్బంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై బాల‌య్య మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. ఈ సినిమాలో అన్ని రకాల కోణాలు ఉంటాయని చెప్పారు. ఈ నేప‌థ్యంలో తన బంధువులు, ఎన్టీఆర్ సన్నిహితులను కలసి ఆయన చిన్నప్పటి విశేషాలను తెలుసుకుని కథను సిద్ధం చేస్తామని బాలకృష్ణ చెప్పారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఎన్‌టీఆర్ జీవితంపై చిత్రం తీయడం అంత వీజీ కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఎన్‌టీఆర్ జీవితంలో ఎన్ని ఉత్థానాలు ఉన్నాయో.. త‌న సొంత అల్లుడు, కుటుంబ సభ్యుల నుంచే ఎన్‌టీఆర్ అన్ని ప‌త‌నాల‌ను రుచి చూశార‌ని, వాటినన్నింటినీ తెర‌మీద‌కి తీసుకురావ‌డం క‌త్తిమీద సామేన‌ని చెబుతున్నారు.

ముఖ్యంగా ఎన్‌టీఆర్ నుంచి టీడీపీని సొంతం చేసుకునే క్ర‌మంల ప్ర‌స్తుత సీఎం చంద్ర‌బాబు పాత్ర ఏమిటో జ‌గ‌మెరిగిన స‌త్య‌మ‌ని, ఈ విష‌య‌మే ఎన్‌టీఆర్ మొత్తం జీవితాన్ని ప్ర‌భావితం చేసింద‌ని, అదేవిధంగా ల‌క్ష్మీపార్వ‌తితో ఎన్‌టీఆర్ వివాహం కూడా పెను సంచ‌ల‌న‌మ‌ని మ‌రి ఈ రెండు విష‌యాలూ లేకుండా సినిమా తీస్తే.. అది అసంపూర్ణ‌మేన‌ని, పోనీ జ‌రిగింది జ‌రిగిన‌ట్టు చూపిస్తే.. సొంత వియ్యంకుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబును విల‌న్‌గా చూపించాల్సి ఉంటుంద‌ని ఇది సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని అంటున్నారు.  ఈ నేప‌థ్యంలో క‌థ‌లో కొన్ని మార్పులు, క‌ల్పితాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌లకు ముందుగా విడుద‌ల చేసేందుకు బాల‌య్య స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలయ్య
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share