ఆ స్టార్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం త‌న వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శాత‌క‌ర్ణి బాల‌య్య కేరీర్‌లోనే ఏ సినిమాకు రాని రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతోంది. బాల‌య్య కేరీర్‌లో వందో సినిమా కావ‌డం, హిస్టారిక‌ల్ మూవీ కావ‌డం, తెలుగు జాతి గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పిన సినిమా కావ‌డంతో పాటు సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో బాల‌య్య సైతం ఈ స‌క్సెస్ జోష్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోనే బాల‌య్య త‌న ఫ్యూచ‌ర్ ప్లానింగ్స్ గురించి చెప్పారు. ఈ క్ర‌మంలోనే గ‌తంలో త‌న డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కాల్సిన న‌ర్త‌న‌శాల‌కు స‌రైన న‌టులు దొర‌క్క‌పోవ‌డం వ‌ల్లే ఆ ప్రాజెక్టు ఆగిపోయింద‌ని బాల‌య్య చెప్పారు. ద్రౌప‌దిగా సౌంద‌ర్య‌, భీముడిగా శ్రీహ‌రి లాంటి న‌టుల‌కు ప్ర‌త్యామ్నాయం దొరికిన‌ప్పుడే ఆ సినిమా తిరిగి పునః ప్రారంభ‌మ‌వుతుంద‌ని బాల‌య్య చెప్పారు.

ఆ సినిమా ఆగిపోయినా త‌న ద‌ర్శ‌క‌త్వం క‌ల తీర‌లేద‌ని… ఇక త‌న ద‌గ్గ‌ర ఓ అద్భుత‌మైన పౌరాణిక క‌థ ఉంద‌ని… ఈ సినిమాలో త‌న‌తో పాటు మ‌రో స్టార్ హీరో సైతం ఉంటాడ‌ని బాల‌య్య చెప్పారు. అయితే ఆ హీరో ఎవ‌ర‌నేది మాత్రం బాల‌య్య చెప్ప‌లేదు. బాల‌య్య ఆ హీరో ఎవ‌రో చెప్ప‌క‌పోయినా మెగాస్టార్ చిరు ఆ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ సంక్రాంతికి ఇద్ద‌రు త‌మ సినిమాల‌తో పోటీప‌డినా బాల‌య్య మాత్రం ఇండ‌స్ట్రీలో త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ చిరంజీవే అని..చిరు సినిమాతో పోటీప‌డితేనే త‌న‌కు అస‌లు సిస‌లు మ‌జా ఉంటుంద‌ని చెప్పారు. ఇక‌ బాల‌య్య డైరెక్ష‌న్‌లో చిరు న‌టిస్తే ఆ సినిమా క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఇక త్వరలో తను చేయబోతున్న ‘ఆదిత్య 999’ సినిమాలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తనతో కలిసి తన కుమారుడు నటించేందుకు ఈ కథ తప్ప వేరేది సెట్ అవ్వదని బాలయ్య స్పష్టం చేశాడు.