కృష్ణమ్మగా మెరిసిపోతున్న అనుష్క

అనుష్క అంటే అద్భుతమే. గ్లామరస్‌ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, విలక్షణ పాత్రలవైపు ఆసక్తి ప్రదర్శిస్తున్న అనుష్క నేటితరం హీరోయిన్లందరికీ రోల్‌ మోడల్‌ అనడం నిస్సందేహం. అందుకే అనుష్కని వెతుక్కుంటూ విలక్షణ పాత్రలు వెళుతున్నాయి. అలా అనుష్కకి దక్కింది ఓ అద్భుతమైన పాత్ర ‘కృష్ణమ్మ’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో అనుష్క నటిస్తోంది.

ఈ సినిమాలో అనుష్క పాత్ర ఇదీ అంటూ కృష్ణమ్మగా అనుష్కను దర్శకేంద్రుడు పరిచయం చేస్తూ మీడియాకి ఓ లుక్‌ విడుదల చేశారు. అద్భుతం అన్న మాట చాలా చాలా చిన్నది కృష్ణమ్మగా అనుష్కని చూపించడం. సన్యాసినిగా ఈ సినిమాలో అనుష్క నటిస్తుందనీ మేకప్‌ లేకుండా ఉంటుందనీ, చూడ్డానికి ఇబ్బందికరమైన పాత్ర అని కూడా టాక్‌ వినవచ్చిందిగానీ, అనుష్కను కృష్ణమ్మగా, దేవతా రూపాన్ని తలపించేలా ఇంత అందంగా దర్శకేంద్రుడు చూపిస్తారని ఎవరూ ఊహించలేదు.

అరుంధతి పాత్రలో అనుష్క తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం. కృష్ణమ్మ పాత్రలో కూడా అనుష్కని తప్ప ఇంకొర్ని ఊహించలేమని ఈ లుక్‌ విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ అంటున్నారు. భక్తి రస చిత్రంగా దర్శకేంద్రుడు ‘ఓం నమో వెంకటేశాయ’ను ఎంత అద్భుతంగా రూపొందించనున్నారో ఈ లుక్‌ని బట్టి అర్థమవుతోంది.