చిరంజీవి ఖైదీ No :150

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో ఖైదీ గెటప్స్‌ వేసిన చాలా చోట్ల ‘786’ అనే నెంబర్‌ని ఉపయోగించేవారు. ఆ నెంబర్‌ అప్పట్లో చాలా ఫేమస్‌. కొన్ని కారణాలతో ఈ నెంబర్‌ని విరివిగా ఉపయోగించడంలేదు. కారణం మతపరమైన సమస్యలే. అయితే చిరంజీవి తన కొత్త సినిమా కోసం ఖైదీ గెటప్‌లో కన్పించాల్సి రావడంతో 150 అనే నెంబర్‌ని ఉపయోగిస్తున్నారు. సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచి లీక్‌ అయిన ఫొటోలో ఈ నెంబర్‌ విషయం వెలుగు చూసింది. చిరంజీవికి ఇది 150వ సినిమా. దాన్ని రిప్రెజెంట్‌ చేసేలా 150 ఖైదీ నెంబర్‌తో చిరంజీవి కనిపించనున్నారు.

వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌. అవడానికి రీమేక్‌ సినిమా అయినప్పటికీ పూర్తిగా తెలుగు నేటివిటీకి తగ్గట్లు అనేక మార్పుల్ని వినాయక్‌, చిరంజీవి, పరుచూరి బ్రదర్స్‌ చేశారని సమాచారమ్‌. ‘ఠాగూర్‌’ని మించి ఈ చిత్రం విజయం సాధిస్తుందని, తెలుగు సినీ రికార్డుల్ని తిరగరాస్తుందని చిత్ర యూనిట్‌ నమ్మకంతో ఉంది. హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా తేలకపోయినా, ఈలోగా హీరో సెంట్రిక్‌ సీన్స్‌ని కంప్లీట్‌ చేసేస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయ్యాక తదుపరి షెడ్యూల్‌ని ప్లాన్‌ చేస్తారు. అలాగే విదేశాల్లో కొన్ని పాటల చిత్రీకరణ కూడా జరగనుంది. లొకేషన్ల ఎంపికపై ఇప్పటికే చిత్ర యూనిట్‌ ఓ అవగాహనకు వచ్చిందని సమాచారమ్‌.