చుక్కలు చూపిస్తున్న డబ్బింగ్ మూవీ

టాలీవుడ్‌లో ఏటా 150-180 సినిమాలు విడుదలవుతుంటే, దాదాపు సగభాగం డబ్బింగ్‌లదే హవా! అగ్ర హీరోల సినిమాలు 10కి మించడం లేదు. తెలుగు హీరోలు కూడా ఇతర మార్కెట్‌లపై కన్నువేయడంతో తమిళంలో చాలామంది మంచి విజయాలే సాధిస్తున్నారు. మలయాళంలోనైతే అల్లు అర్జున్‌దే స్టార్‌డమ్. ప్రస్తుతం ఈ మార్కెట్‌పై మోహన్‌లాల్‌తో కలసి జూ.ఎన్టీఆర్ కన్నేశాడు. బాలీవుడ్‌లో తెలుగు హిట్స్ రీమేక్‌లుగా రావడంతోపాటు డబ్బింగ్‌ల జోరుకూడా పెరిగింది. ‘ఈగ’ బాలీవుడ్ మార్కెట్‌తో అవాక్కైన రాజవౌళి, బాహుబలిని మాత్రం కరణ్‌జోహార్ చేతిలో పెట్టి మంచి క్రేజ్ కొట్టాడు. అందుకే బాహుబలి-2కి క్రేజీ ఆఫర్‌లు వస్తున్నా కరణ్‌కే ఓటేస్తున్నాడని వినికిడి.

టెక్నికల్ వాల్యూస్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్స్, కాస్ట్ఫా ప్రొడక్షన్ వంటి అనేక కారణాలతో చాలా చిత్ర నిర్మాణ సంస్థలు నిర్మాణానికి దూరమైపోయాయి. వీటన్నింటికి నేడు డబ్బింగ్ ఓ మంచి అవకాశంగా ఉంది. అందుకే వీరు సబ్జెక్ట్‌వున్న సినిమాలతోపాటు సబ్జెక్ట్‌లేని సినిమాలకు సైతం పబ్లిసిటీతో హోరెత్తిస్తున్నారు. కొన్ని సినిమాలకు ఫ్యాన్సీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం శంకర్ రోబో-2 ఆ స్థాయిలోనే ఉంది. రాబోయే ‘కబాలి’ కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌తో ఉంది. శ్రీ తిరుమల తిరుపతి శ్రీనివాసా సంస్థపై అనేక స్ట్రయిట్ సినిమాలు తీసిన చదలవాడ శ్రీనివాసరావు చాలాకాలం తర్వాత ‘బిచ్చగాడు’వంటి డబ్బింగ్ సినిమాతో మంచి హిట్‌నికొట్టి డబ్బింగ్ చిత్రాలపై ఆశను పెంచారు.

ఈ కోవలోనే జి.హరి ‘రాయుడు’ సినిమాను డబ్బింగ్‌గా అందించి ఇప్పుడు విశాల్‌తోనే స్ట్రెయిట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ‘చంద్రముఖి’ తర్వాత వరస హార్రర్ సినిమాలు డబ్బింగ్ రూపంలో నెలకు రెండు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాయి. సక్సెస్ మాటెలావున్నా సేఫ్ ప్రాజెక్ట్‌లుగా ఊరటనిస్తున్నాయి. ఏదేమైనా రీమేక్.. డబ్బింగ్‌ల వల్ల దమ్మున్న కథలు పలు భాషల్లో ప్రేక్షకులను అలరించడం సంతోషమే కదా! బెంగాలీలో శరత్ రాసిన నవల ఆధారంగా నిర్మితమైన ‘దేవదాసు’ చిత్రం ఇప్పటికీ అన్ని భాషలు కలిపి 15కి పైగా సినిమాలుగా రావడం రీమేక్ స్టామినా కథకు నిదర్శనంగా కనిపిస్తుంది. కథలో పట్టుంటే డబ్బింగ్ డబ్బుల మూట అందించడం ఖాయం.